
మా భూములకు హక్కులు కల్పించండి
అక్కన్నపేట(హుస్నాబాద్): మా భూములకు హక్కులు కల్పించాలంటూ రైతులు నిరసన తెలిపారు. మండల పరిధిలోని నందారంలో గురువారం భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 930 ఎకరాల వరకు పచ్చని పంట పొలాలన్నీ సీలింగ్ భూములుగా ఉండడంతో అమ్మకాలు, కొనుగోలు లేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గతంలో అనేకసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడంలేదన్నారు. బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వడంలేదన్నారు. తక్షణం కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులకు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న కొహెడ మండల తహసీల్దార్ సురేఖకు వినతిపత్రం అందజేశారు.
భూ భారతి రెవెన్యూ సదస్సులో రైతుల నిరసన