
ఎల్లమ్మ తల్లి సన్నిధిలో జిల్లా జడ్జి
హుస్నాబాద్: రేణుకా ఎల్లమ్మ జాతరను పురస్కరించుకొని బుధవారం జిల్లా జడ్జి సాయి రమాదేవి, ఏసీపీ సదానందంలు ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందించి వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ధర్మకర్తలు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
నేడు హనుమాన్ తెప్పోత్సవం
సిద్దిపేటకమాన్: పట్టణంలోని కోమటిచెరువులో గురువారం హనుమాన్ తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో మాలధారులకు అన్నప్రసాదం 16 ఏళ్లుగా నిర్వహిస్తున్నామన్నారు. దేవాలయం నుంచి శోభాయాత్రగా బయలుదేరి కోమటి చెరువు వద్ద తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హనుమాన్ మాలధారులు, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆలయ అర్చకులు వైద్య కృష్ణమాచార్య, ట్రస్ట్ సభ్యులు నేతి కై లాసం, గ్యాదరి పరమేశ్వర్, నందిని శ్రీనివాస్, కుమ్మరికుంట రమేష్, తిప్పరాజు మధుసూదన్, చింత శ్రీనివాస్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేటరూరల్: దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థ హైదరాబాద్‌లో మూడేళ్ల పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీకాంతరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలు, తల్లి లేదా తండ్రి లేని బాలికలు టెన్త్ పాసై ఉన్న వారు అర్హులన్నారు. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇతర సమాచారం కోసం జిల్లా కలెక్టరేట్ రెండో అంతస్తు, రూమ్ నంబర్ 528లో సంప్రదించాలని సూచించారు.
రేపు క్రికెట్ జట్టు ఎంపిక
సిద్దిపేటజోన్: అండర్ –25 విభాగంలో జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ఈనెల 16న నిర్వహించనున్నట్లు సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మల్లికార్జున్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో జట్టును ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 31అగస్టు 2000వ సంవత్సరం తర్వాత జన్మించిన వారు జట్టు ఎంపికకు అర్హులని పేర్కొన్నారు.

ఎల్లమ్మ తల్లి సన్నిధిలో జిల్లా జడ్జి