
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
పంచాయతీ
కార్యదర్శిపై ఫిర్యాదు
కొండపాక(గజ్వేల్): మండలంలోని ఖమ్మంపల్లిలో సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. డబుల్ బెడ్రూంల నుంచి వస్తున్న మురుగు బయటకు వెళ్లేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదన్నారు. అలాగే ఏడాది కాలంగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో మురుగు అంతా ఇళ్ల మధ్య నిలుస్తోందన్నారు. దీంతో దుర్గంధం వ్యాపిస్తోందని తెలిపారు. ఇళ్ల మధ్య ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించాలంటూ మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి గ్రామ చెర్వులోకి సాగు నీరు వచ్చేందుకు ఆగిపోయిన కాలువ పనులు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. గ్రామంలో వీధిలైట్లు, మంచి నీటి సరఫరా విషయాల్లో సమస్యలు తలెత్తినప్పడు కార్యదర్శిని సంప్రదించాలంటే అందుబాటులో ఉండటంలేదన్నారు. సమస్యలు పట్టించుకోని కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఫిర్యాదు చేస్తూ వేడుకున్నారు.
సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి వస్తారని, అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణం పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీలు పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణికి మొత్తంగా 49 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కాలువపై బ్రిడ్జి నిర్మించండి
చెల్లాపూర్‌లో కాలువపై బ్రిడ్జి నిర్మించాలని రైతులు కోరారు. ఈ మేరకు కలెక్టర్‌కు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో మిషన్ కాకతీయ కాలువ నిర్మించారని, దీంతో దారిలేక 300 మంది రైతులు ఇబ్బంది పడుతున్నామన్నారు. పశువులను తోలుకెళ్లడానికి కూడా తిప్పలు తప్పడంలేదన్నారు. వేరే దారి గుండా వెళ్లాలంటే 8 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఈ విషయమై ఎన్నోసార్లు ఇరిగేషన్ అధికారులకు చెప్పినా స్పందించడంలేదని వాపోయారు. కాలువపై బ్రిడ్జి నిర్మించి సమస్య పరిష్కరించాలని వారు కోరారు.
కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి
ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 49