
బెజ్జంకి(సిద్దిపేట): కంటి వెలుగు రెండో దశ అమలులో సిద్దిపేట రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని జెడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. మండలంలోని తోటపల్లిలో సోమవారం మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 ఏళ్ల నిండిన ప్రతీ ఒక్కరు నేత్ర పరీక్షలు చేసుకోవాలని, అవసరమున్నవారికి అద్దాలు అందించి, శస్త్రచికిత్సలు కూడా చేస్తారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చొరవతో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. తోటపల్లిలో నిర్మిస్తున్న పీహెచ్‌సీ నిర్మాణాన్ని పరిశీలించి, పనులు నాణ్యతతో చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ అంధత్వరహిత రాష్ట్రం లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమం అమలు చేస్తున్నామని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, ఏఎంసీ చైర్మన్ కచ్చు రాజయ్య, సర్పంచ్ బోయినిపెల్లి నర్సింగారావు, ఎంపీటీసీ లక్ష్మి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, దాచారం సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓగా
చంద్రమోహన్‌రెడ్డి
సిద్దిపేటరూరల్: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఇన్‌చార్జ్ అధికారిగా చంద్రమోహన్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డీఆర్‌డీఓ గోపాల్‌రావు బదిలీపై వెళ్లడంతో జిల్లా సహకార శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న చంద్రమోహన్‌రెడ్డికి ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఉచిత యోగా శిక్షణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలోని విద్యార్థులకు ఐదు రోజులపాటు ఉచిత యోగా శిక్షణ అందించనున్నట్లు వ్యాస మహర్షి యోగా సొసైటీ అధ్యక్షుడు తోట అశోక్, సిద్దిపేట యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, యోగా శిక్షకులు తోట సతీష్, సంధ్య తెలిపారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ సి.వీరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు ఉంటుందని తెలిపారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 1వరకు జిల్లా కేంద్రంలోని వ్యాస మహర్షి యోగా కేంద్రంలో సాయంత్రం 6 గంటల నుంచి 7గంటల వరకు తరగతులు ఉంటాయని, ఆసక్తి ఉన్నవారు 6302227030, 9160139889 నంబర్లలో సంప్రదించాలన్నారు.
చిరుత కలకలం
పెద్ద శంకరంపేట(మెదక్): మండల పరిధిలోని కే వెంకటాపూర్ శివారులో చిరుత సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడిలో లేగ దూడ మృతి చెందిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సోమవారం అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టగా పులి పాదముద్రలు కన్పించాయి. గుట్టపై చిరుత పులి సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ రేంజ్ అధికారి వికాస్ తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని.. ఒంటరిగా ఎవరూ అటవీ ప్రాంతంలో తిరగవద్దని సూచించారు.

వివరాలు సేకరిస్తున్న ఫారెస్ట్ అధికారులు

మహిళకు కళ్ల అద్దాలు తొడుగుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్యే రసమయి