పరిశుభ్రత ప్రతిజ్ఞ

- - Sakshi

సాక్షి, సిద్దిపేట: నా ఇల్లు, నా వీధి, నా పట్టణం పరిశుభ్రంగా ఉంచుతా.. చెత్తరహిత పట్టణానికి కృషి చేస్తా... అంటూ అధికారులు పట్టణవాసులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వచ్ఛోత్సవ్‌ 2023 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛతలో మహిళలను భాగస్వాములు చేసేలా మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పలు విషయాల్లో పరిశుభ్రత పాటించే వారిని గుర్తించి ఉమెన్స్‌ ఐకాన్స్‌ లీడింగ్‌ స్వచ్ఛత (విన్స్‌) అవార్డు–2023కు ఎంపిక చేయనున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఉత్తములకు అవార్డులు

● జిల్లాలో సిద్దిపేట, హుస్నాబాద్‌, గజ్వేల్‌, చేర్యాల, దుబ్బాక మున్సిపాలిటీలున్నాయి.

● స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ వరకు స్వచ్ఛోత్సవ్‌–2023 కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

● విన్స్‌ అవార్డులో భాగంగా సామాజిక మరుగుదొడ్లు, సెప్టిక్‌ ట్యాంకుల నిర్వహణ, వ్యర్థ జలాల వినియోగం, చెత్త సేకరణ, చెత్త నుంచి సంపద సృష్టించడం తదితర అంశాలపై పోటీ నిర్వహిస్తారు.

● ఈ కార్యక్రమానికి స్వశక్తి మహిళలు, చిన్న తరహా పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అర్హులు.

● స్వచ్ఛతలో అత్యున్నత సేవలందించడంతో పాటు ఉపాధి పొందుతున్న ఐదుగురిని ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు.

● ఎంపికై న వారికి జూన్‌ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున విన్‌–2023 అవార్డులను ప్రదానం చేస్తారు.

● దీని కోసం ఈ నెల 29, 30తేదీల్లో పట్టణాల్లో మహిళా, యువజన, స్వచ్ఛంద సంస్థలతో స్వచ్ఛత యాత్రను నిర్వహించేందుకు మున్సిపాలిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఇలా దరఖాస్తు చేయాలి

చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దుతా.. అంటూ పట్టణంలో ప్రతీ ఒక్కరితో ప్రతిజ్ఞ చేసేందుకు అధికారులు ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచారు. https://www.sbmurban.org/swachh-pledge లింక్‌ను ఓపెన్‌ చేసి రాష్ట్రం పేరు, జిల్లా, మున్సిపాలిటీ వివరాలు, వ్యక్తి పేరును ఎంటర్‌ చేయాలి. ‘చెత్త రహిత పట్టణంగా తీర్చి దిద్దుతా’ అనే ఆప్షన్‌ దగ్గర రైట్‌ మార్క్‌ పెట్టాలి. అప్పుడు సదరు వ్యక్తి ఆన్‌లైన్‌ వేదికగా ప్రతిజ్ఞ చేసినట్లు నమోదవుతుంది. అనంతరం ప్రతిజ్ఞ పూర్తయిన సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్నవారి నుంచి ఉత్తములను ఎంపిక చేసి వారికి అవార్డులను అందిస్తారు. సోమవారం సిద్దిపేట పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ ఖాన్‌, కమిషనర్‌ సంపత్‌ కుమార్‌, చైర్‌పర్సన్‌ కడవేర్గు మంజుల, కౌన్సిలర్లు ఆధ్వర్యంలో పలువురితో ప్రతిజ్ఞ చేయించారు.

మున్సిపాలిటీల్లో స్వచ్ఛోత్సవ్‌ పోటీలు

‘విన్స్‌–2023’ పేరిట అవార్డులు

ఈ నెల 30వ తేదీ వరకు

దరఖాస్తులకు అవకాశం

అందరూ భాగస్వాములు కావాలి

ఆన్‌లైన్‌ వేదికలో అందరి భాగస్వామ్యం కావాలి. ప్రజల సహకారంతో స్వచ్ఛ సిద్దిపేటగా రూపుదిద్దుకుంటోంది. ప్రజలు ఆన్‌లైన్‌ వేదికగా స్వచ్ఛ ప్రతిజ్ఞ చేసి సిద్దిపేటను పోటీలో ముందు వరుసలో నిలబెట్టాలి.

– సంపత్‌ కుమార్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, సిద్దిపేట

Read latest Siddipet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top