సంగారెడ్డి జోన్: జిల్లాలో ఈ నెల 29న నిర్వహించనున్న ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 9,960 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని, గంట ముందే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రవేశం ఉండదన్నారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశించారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్‌టికెట్, పెన్ను మాత్రమే తీసుకురావాలని, మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలు, బ్యాగులకు అనుమతి లేదన్నారు. ముందుగానే పరీక్ష కేంద్రాన్ని పరిశీలించుకోవాలని, బయో మెట్రిక్ నమోదుకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎస్పీ పరితోశ్ పంకజ్


