జుజాల్‌పూర్‌ హెచ్‌ఎం సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

జుజాల్‌పూర్‌ హెచ్‌ఎం సస్పెన్షన్‌

Nov 28 2026 10:29 AM | Updated on Nov 28 2026 10:29 AM

జుజాల్‌పూర్‌ హెచ్‌ఎం సస్పెన్షన్‌ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబంధనలు పాటించాల్సిందే.. బాల్య వివాహాలను నిర్మూలించాలి

నారాయణఖేడ్‌: మండలంలోని జుజాల్‌పూర్‌ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఇన్‌చార్జి హెచ్‌ఎం జ్యోతి రాథోడ్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఈఓ రోహిణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలను డీఈఓను తనిఖీ చేసిన సమయంలో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే తరగతులకు హాజరైనప్పటికీ, ఎఫ్‌ఆర్‌ఎస్‌లో మాత్రం 12 మంది ఉన్నట్లుగా నమోదు చేసినట్లు గుర్తించారు. అంతే కాకుండా సమీపంలోని మదర్సా పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థుల హాజరును పాఠశాల విద్యార్థులుగా తప్పుగా నమోదు చేస్తున్నట్లు బహిర్గతమైంది. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడమే కాకుండా విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేనట్లుగా గుర్తించారు. సస్పెషన్‌ తక్షణం అమల్లోకి వస్తుందని, విచారణ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా జిల్లా కేంద్రం విడిచి వెళ్లరాదని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.

సదాశివపేట(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తూ పాఠ శాల పరిసరాల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్‌ పాండు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల అవరణ, పరిసరాలు, తరగతి గదులు, వసతి గృహం, భోజనశాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్‌, వార్డెన్లకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. విద్య, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకొని వారితో కలసి భోజనం చేశారు. ఆయన వెంట డీఎల్పీఓ అనిత, ఎంఈఓ శంకర్‌, ఎంపీడీఓ అంజలి తదితరులు ఉన్నారు.

సంగారెడ్డి: పట్టణంలోని లలిత ఫెర్టిలిటీ ఆస్పత్రిని డీఎంహెచ్‌ఓ లలితాదేవి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది వివరాలు, పరిశుభ్రత, అత్యవసర సేవలను పరిశీలించారు. కన్సల్టింగ్‌ డాక్టర్ల అర్హతలు, రిజిస్ట్రేషన్‌ వివరాలతో బోర్డు ఏర్పాటు చేయాలని, ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. సిజేరియన్‌ ప్రసవాల రేటు తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. స్కానింగ్‌ యంత్రాలను అనుమతించిన ప్రదేశాల్లోనే నిర్వహించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

సంగారెడ్డిటౌన్‌/కొండాపూర్‌(సంగారెడ్డి): బాల్య వివాహాలను నిర్మూలించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి ప్రభుత్వ బాలికల పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలు తమ విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. బలవంతపు వివాహాలకు గురికాకుండా హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్యవివాహాలు నిర్వహిస్తే 1098 చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. అలాగే కొండాపూర్‌ మండలంలోని గారకుర్తిలో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి, న్యాయ సేవలను చేరువ చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాఘవేందర్‌, ఉపసర్పంచ్‌ మల్లికార్జున్‌ రెడ్డి, ఎస్సై సోమేశ్వరి, మండల వ్యవ సాయ అధికారి గణేశ్‌, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement