ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

ఆగమాగం

Nov 28 2026 10:29 AM | Updated on Nov 28 2026 10:29 AM

అకాల వర్షం..

జిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. పుల్కల్‌, చౌటకూర్‌, వట్‌పల్లి, ఆందోల్‌ తదితర మండలాల్లో కొందరు రైతులు ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోశారు. వర్షం ధాటికి ఈ ధాన్యం కొట్టుకుపోయింది. మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. అయితే ధాన్యాన్ని కాపాడుకునేందుకు టాల్పాలిన్లు ఇవ్వాలని అడిగినా మార్కెట్‌ యార్డు సిబ్బంది పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలుచోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు తడిసిపోయాయి. జిల్లాలో అత్యధికంగా హత్నూర మండలంలో భారీ వర్షం పడింది. దీంతో మండలంలోని చందాపూర్‌, నస్తీపూర్‌, కొన్యాల, హత్నూరలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడ్డారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

హత్నూరలో రికార్డు వర్షపాతం

జిల్లాలో అత్యధికంగా హత్నూర మండలంలో భారీ వర్షపాతం నమోదైంది. ఏకంగా 4.9 సెం.మీల వర్షం కురిసింది. అలాగే చౌటకూర్‌లో 1.6 సెం.మీలు, ఆందోల్‌లో 1.3 సెం.మీ రికార్డు అయింది. సిర్గాపూర్‌, కల్హేర్‌, నాగల్‌గిద్ద, రాయికోడ్‌, జహీరాబాద్‌, కోహీర్‌, వట్‌పల్లి, పుల్కల్‌, సదాశివపేట, కొండాపూర్‌, సంగారెడ్డి, కంది, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, రామచంద్రాపురం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో సగటున 5.2 మి.మీ వర్షపాతం నమోదు అయింది.

సేకరణ ఊపందుకోకపోవడంతో..

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఆశించిన మేర ఊపందుకోలేదు. చాలా మట్టుకు ధాన్యం కల్లాల వద్దే ఉంది. కాంటాలు కాకపోవడం, లారీలు రావడంలో జాప్యం జరుగుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయింది. ప్రైవేట్‌లో విక్రయించుకోని రైతులు కొనుగోలు కేంద్రాల్లో అమ్మేందుకు సిద్ధంగా ఉంచారు. తీరా అకాల వర్షంతో ఈ ధాన్యం తడిసిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. గురువారం రాత్రి కురిసిన భారీవర్షానికి జిల్లాలోని పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. చేతికందిన పంటను కాపాడుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు తంటాలు పడ్డారు. జోగిపేట మార్కెట్‌ యార్డులో వరదలో ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

తడిసి ముద్దయిన ధాన్యం

జోగిపేట మార్కెట్‌ యార్డులో కొట్టుకుపోయిన వడ్లు

కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో తడిసిన బస్తాలు

ఆరబెట్టేందుకు ఇబ్బంది పడుతున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement