జహీరాబాద్: అమృత్ పథకం కింద రూ. 25 కోట్లతో చేపట్టిన జహీరాబాద్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. డిసెంబర్ నెలాఖరు వరకల్లా స్టేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 90 శాతం మేర పూర్తి కాగా, చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
మూడేళ్ల క్రితం పనులు ప్రారంభం
జహీరాబాద్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులు మూడేళ్ల సుదీర్ఘ కాలానికి పూర్తి కావొస్తున్నాయి. గతేడాది పనులు మందగించడంతో జాప్యం జరిగింది. దీంతో డీఎంఓ నరేంద్రవర్మ, డివిజనల్ మేనేజర్ సంజయ్‌కుమార్, డీఆర్‌ఎం గోపాలకృష్ణ రైల్వేస్టేషన్‌ను సందర్శించి పనుల్లో వేగం పెంచేలా చర్యలు చేపట్టారు. ఫలితంగా ఐదు నెలల నుంచి ముమ్మరంగా పనులు జరుగుతుండటంతో పూర్తి కావొచ్చాయి. ఇప్పటికే రెండు ప్లాట్‌ఫాంల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా షెడ్లను నిర్మించారు. రెండు ప్లాట్ ఫాంలపై షెడ్లను, బెంచీలను ఏర్పాటు చేశారు. 2023 ఆగస్టు 6న అమృత్ పథకంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా దేశవ్యాప్తంగా మొదటి విడత కింద ఎంపికై న రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే అప్పటి నుంచి పనులు నత్తనడకన కొనసాగడంతో ఇప్పటి వరకు వినియోగంలోకి రాకుండా పోయింది.
రవాణా సదుపాయం మెరుగు
ప్రధాన స్టేషన్ కావడంతో జహీరాబాద్‌ను అమృత్ పథకం కింద చేర్చారు. ఇక్కడి నుంచి నిత్యం 900 మంది వరకు ప్రయాణికులు పలు ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. 30 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. జహీరాబాద్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, నాందేడ్, షిర్డీ, వికారాబాద్, లాతూర్, పూణె, బీదర్, బెంగళూరు, మచిలీపట్నం, పర్లి వైజ్యనాథ్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. స్టేషన్‌లో నిర్మాణాలన్నీ పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది. స్టేషన్‌ను అమృత్ పథకంలో అభివృద్ధి పర్చడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.25 కోట్లతో రైల్వేస్టేషన్ అభివృద్ధి
డిసెంబర్ నెలాఖరులోగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు
నిత్యం 30 రైళ్ల రాకపోకలు


