పాపన్నపేట(మెదక్): పదో తరగతిలాగే ఇక మీదట ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్‌లపై పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్)ను ముద్రించనున్నారు. తద్వారా సదరు విద్యార్థి ఉన్నతవిద్యను కొనసాగిస్తున్నారా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. దీంతో డ్రాపౌట్స్‌ను పసిగట్టొచ్చు. వచ్చే మార్చిలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సర్టిఫికెట్లపై 11 అంకెల పెన్ నంబర్ ముద్రిస్తారు. ఈ సర్టిఫికెట్‌లను డిజి లాకర్‌లో భద్రపర్చుకోవచ్చు. మెదక్ జిల్లాలో ఫస్టియర్‌లో 5,684, సెకండియర్‌లో 6,719 కలసి మొత్తం 12,403 విద్యార్థులు చదువుతున్నారు.
పెన్‌తో విద్యార్థి వివరాలు ట్రాక్
ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీస్థాయికి వెళ్లే సరికి సుమారు 40% మంది విద్యార్థులు డ్రాపౌట్స్ అవుతున్నారని అధికారిక లెక్కలు సూచిస్తున్నాయి. అయితే వారు ఏ స్థాయిలో చదువు మానేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్నారా? అనే విషయాలు తెలుసుకోవడానికి విద్యాశాఖ ట్రాకింగ్ సిస్టం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం యూడైజ్ పోర్టల్ ద్వారా ప్రతీ విద్యార్థికి ఈ పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ఇస్తున్నారు. 2024 నుంచి పదో తరగతి సర్టిఫికెట్లపై ఈ పెన్‌ను ముద్రిస్తున్నారు. దాన్ని సమగ్ర శిక్ష నుంచి ఇంటర్‌బోర్డు తీసుకుంటుంది. కానీ, సర్టిఫికెట్‌లపై ముద్రించడం లేదు.
డిజిలాకర్‌లో సర్టిఫికెట్లు భద్రం
ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, ప్రయాణాలు చేసేటప్పుడు ఒకోసారి సర్టిఫికెట్లు పోగొట్టుకున్న సందర్భంలో, వాటిని తిరిగి పొందడానికి ఆయా ధ్రువపత్రాలను డిజి లాకర్‌లో భద్రపర్చుకునే అవకాశం ఉంది. అందుకే అపార్ పేరిట విద్యార్థులకు 12 అంకెల గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. సొంతగానే దాన్ని అపార్ పోర్టల్ ద్వారా పొందొచ్చు. దీనికి తప్పనిసరిగా ఆధార్ నంబర్ ఉండాలి. విద్యా సంస్థల ద్వారా పొందాలంటే ఆధార్ సంఖ్య ఇవ్వడమే గాకుండా, తల్లిదండ్రుల అంగీకారం అవసరం. అపార్ ఐడీ ఉంటేనే, తమ సర్టిఫికెట్లను డిజిలాకర్‌లో భద్రపర్చుకునే అవకాశం ఉంటుంది. డిజి లాకర్ ఏజెన్సీతో ఇంటర్ బోర్డు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయమై పాపన్నపేట ప్రిన్సిపాల్ నర్సింహులు మాట్లాడుతూ..పీఈఎన్ ద్వారా విద్యార్థుల వివరాలు తెలుసుకోచ్చన్నారు. డ్రాపౌట్స్ వివరాలు తెలియడం ద్వారా తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టవచ్చన్నారు.
పదోతరగతి లాగే 11 అంకెల పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్
ఇక డ్రాపౌట్స్‌కూ చెక్ పెట్టే అవకాశం
డిజిటల్ లాకర్‌లో సర్టిఫికెట్‌లు భద్రం
మెదక్ జిల్లాలో 12,403 మంది ఇంటర్ విద్యార్థులు


