ఎకరానికి రూ.9,600సబ్సిడీ సాయం
లబ్ధిదారుల ఎంపిక
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఆలుగడ్డ సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ సాయం అందించాలని నిర్ణయించింది. కూరగాయలు సాగు చేసే రైతులకు ఇచ్చే సబ్సిడీ పథకాన్ని తొలిసారిగా ఈ సీజన్ నుంచే అమలు చేస్తున్నారు. కూరగాయల సాగు విస్తీర్ణాభివృద్ధి పథకం కింద ఈ పంట వేసుకునే రైతులకు ఎకరానికి రూ.9,600 ఆర్థిక సాయం అందిస్తారు. విత్తనం, ఎరువులు, పురుగు మందుల ఖర్చుల కింద సబ్సిడీ ఇస్తారు. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు.
ఈసారి 800 ఎకరాలకు..
జిల్లాలో సుమారు మూడు వేల ఎకరాల్లో ఆలు పంట సాగవుతుంది. ప్రధానంగా జహీరాబాద్, కోహీర్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, ఝరాసంఘం తదితర మండలాల్లో ఈ పంటను సాగు చేస్తారు. పంట వేసుకునే రైతులకు ఎలాంటి ప్రోత్సాహక పథకాలు ఇప్పటి వరకు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అమలు చేస్తున్న కూరగాయల సాగు విస్తీర్ణాభివృద్ధి పథకం పరిధిలోకి ఈసారి నుంచి ఈ పంటను తెచ్చారు. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 800 ఎకరాలకు ఈ సబ్సిడీని ఇవ్వాలని భావిస్తున్నారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రభుత్వం ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తోంది. తక్కువ నీటి వినియోగం అయ్యే పంటలకు ప్రాధాన్యం ఇస్తోంది.
ఢిల్లీ, పంజాబ్ నుంచి విత్తనం
ఆలుగడ్డ పండించే రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా విత్తనాల కోసం రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఢిల్లీ, పంజాబ్ వంటి ప్రాంతాల నుంచి విత్తనాలు ఏటా కొనుగోలు చేస్తారు. విత్తన ఆలు గతంలో క్వింటాల్‌కు రూ.2,400 ఉంటే.. ఇప్పుడు రూ.నాలుగు వేలకు మించిపోయింది. అంటే విత్తనం ధర క్వింటాల్‌కు రూ.రెండు వేల వరకు పెరిగింది. అయితే ఒక్కో ఎకరానికి సుమారు ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్ల విత్తనం అవసరం ఉంటుంది. దీంతో విత్తనం కోసమే ఎకరానికి రూ.పది వేల భారం పడుతోంది. దీనికి తోడు ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు ఇలా సాగు ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సబ్సిడీ పథకంతో ఈ రైతులకు కొంత ఉపశమనం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈసారి పరిమితంగా 800 ఎకరాలకు మాత్రమే సబ్సిడీ మంజూరైందని, ఎక్కువ మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే ఒక్కో రైతుకు ఎకరం చొప్పున సబ్సిడీ సాయాన్ని అందిస్తామని ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వరరావు ‘సాక్షి’ ప్రతినిధితో తెలిపారు.
ఈ సీజన్ నుంచే తొలిసారిగా పథకం అమలు
విత్తన ఆర్థిక భారం నుంచి కాస్త ఉపశమనం
జిల్లాలో సుమారు 3 వేల ఎకరాల్లో పంట
ఈ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆయా మండల అధికారులు రైతుల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఈ పథకం లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. ఇప్పటి వరకు సుమారు 500 మంది ఆలు రైతులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. ఈ పంటను సాధారణంగా అక్టోబర్ మాసాల్లో విత్తుకుంటారు. అయితే ఈసారి వాతావరణంలో మార్పుల కారణంగా కాస్త ఆలస్యంగా విత్తుకుంటున్నారు.


