● పటిష్టంగా ‘పీఎం రాహత్’ అమలు
● ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తామని ఎస్పీ పరితోశ్ పంకజ్ అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గాయపడిన వారికి సకాలంలో మెరుగైన వైద్య చికిత్స అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం రాహత్’ పథకాన్ని ప్రవేశపెట్టిందని, జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని ఎంపానెల్డ్ ఆస్పత్రులకు తరలించి, ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే మహిళల భద్రత కోసం జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంక్షేమ వసతి నిలయాలు, బస్టాండ్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో షీ బాక్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మహిళలు తమ ఫిర్యాదులు అందించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేయాలన్నారు.


