కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
సంగారెడ్డి: అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో మంజీరానగర్, అబ్కారీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 210లోని లేఅవుట్లలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సదరు లేఅవుట్‌కు సంబంధించిన ఎల్‌పీ నంబర్ 2/97, 368/87లో కేటాయించిన 80 అడుగుల రహదారి స్థలంలోనే నిర్మాణాలు చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్ ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సంబంధిత పట్టణ ప్రణాళిక అధికారులు ఆ ఆదేశాలను పట్టించుకో వడం లేదని, చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
ప్రభుత్వ స్థలాల ఆక్రమణ
పట్టణ ప్రణాళిక అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ, రహదారి స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమాయక ప్రజలకు చెందిన స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలను తక్షణ మే నిలిపివేసి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అమాయక ప్రజల స్థలాలను కబ్జా చేసినట్లు విచారణలో తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, బాధితులకు వారి ఆస్తులను తిరిగి అందించేలా చర్యలు చేపట్టాలని పట్టణవాసులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే విషయమై ‘సాక్షి’ మున్సిపల్ అధికారులను ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. కనీసం ఆఫీస్ సైతం ఉండకపోవడం గమనార్హం.
పట్టించుకోని పట్టణ ప్రణాళిక అధికారులు
కబ్జాకు గురవుతున్న అమాయకుల ప్లాట్లు
అధికారుల అండదండలు!
సంగారెడ్డి పట్టణంలో గతంలో కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో నిర్మాణాలు చేపడుతున్న సమయంలో అధికారులు స్పందించకుండా, నిర్మాణం పూర్తయిన తర్వాత కూల్చివేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఆయా నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని విమర్శిస్తున్నారు. అలాగే అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదులను డీటీఎఫ్‌లో నమోదు చేసి సంవత్సరాలు గడుస్తున్నా, వాటిని కూల్చివేసే విషయంలో అధికారులు ముందుకు రావడం లేదని పట్టణంలో చర్చ జరుగుతోంది. దీంతో అక్రమ నిర్మాణదారులకు అధికారుల అండదండలు ఉన్నాయా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.


