గనులశాఖలో కుర్చీలాట! | - | Sakshi
Sakshi News home page

గనులశాఖలో కుర్చీలాట!

Nov 12 2026 11:36 AM | Updated on Nov 12 2026 11:36 AM

ఎనిమిది నెలల్లో నలుగురు అసిస్టెంట్‌ డైరెక్టర్ల మార్పు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మైనింగ్‌ కుంభకోణాలకు నిలయంగా మారిన భూగర్భగనుల శాఖలో కుర్చీలాట కొనసాగుతోంది. ఎనిమిది నెలల్లో ఏకంగా నలుగురు అసిస్టెంట్‌ డైరెక్టర్లు (ఏడీ) మారడం చర్చనీయాంశంగా మారింది. ఆశాఖ జిల్లా ఉన్నతాధికారి పోస్టు తీరు ఇలా ఉండటంతో ఒకింత గందరగోళం ఏర్పడుతోంది. గతంలో ఇక్కడ ఏడీగా పనిచేసిన రవిబాబు ఈఏడాది ఏప్రిల్‌లో పదోన్నతిపై ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో సంజయ్‌కు బాధ్యతలు అప్పగించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏడీగా పనిచేస్తున్న ఆయనకు సంగారెడ్డి ఏడీ అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆయన రెండు నెలలు కూడా ఇక్కడ పనిచేయలేదు.

అంతా అయోమయం!

ఆ తర్వాత ఈ పోస్టులో విజయ్‌కుమార్‌ను నియమించారు. మైనింగ్‌ కుంభకోణాలను నిలయంగా మారిన సంగారెడ్డి జిల్లాలో పనిచేసేందుకు ఆయన ప్రారంభంలో సుముఖంగా లేరనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే కొద్ది రోజులు ఇక్కడ పనిచేసిన విజయ్‌కుమార్‌ మూడు నెలల పాటు మెడికల్‌ లీవ్‌లో వెళ్లిపోయారు. అటు నుంచి అటే వేరే శాఖకు ఫారెన్‌ సర్వీసుపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూరనే చర్చ జరిగింది. విజయ్‌కుమార్‌ మెడికల్‌ లీవ్‌పై వెళ్లడంతో ఆయన స్థానంలో మెదక్‌ జిల్లా ఏడీ కార్యాలయంలో ఏజీ (జియాలజిస్టు)గా పనిచేస్తున్న హరిప్రసాద్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. ఆయన ఒక్క నెల ఇక్కడ పనిచేశారు. తాజాగా విజయ్‌కుమార్‌ తన మూడు నెలల సెలవును నెలకు కుదించుకుని ఇటీవల తిరిగి ఏడీగా విధుల్లో చేరారు. ఇలా దాదాపు ఎనిమిది నెలల్లోనే ఏకంగా నలుగురు ఏడీలు మారడంతో గనులశాఖలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కీలక బాధ్యతల్లో ఎవరు ఉంటున్నారో.. ఎవరు వెళ్లిపోతున్నారో తెలియక అయోమయం నెలకొందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తరచూ అధికారులు మారడంతో పాలన గందరగోళం

అక్రమ మైనింగ్‌పై కరువవుతున్న పర్యవేక్షణ

రెచ్చిపోతున్న మైనింగ్‌ మాఫియా

భారీ కుంభకోణాలు

అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలకు సంగారెడ్డి జిల్లా పెట్టింది పేరు అన్నట్లు తయారైంది. రూ.వందల కోట్లు విలువ చేసే ఖనిజ సంపదను అక్రమార్కులు దొడ్డిదారిన కొల్లగొడుతున్నారు. ఒక్క స్టోన్‌– మెటల్‌ క్వారీల్లో ఏకంగా రూ.వందల కోట్ల సీనరేజీ ఎగవేసినట్లు తరచూ వెలుగులోకి వస్తున్న విషయం విధితమే. రాజకీయ నేతలే బినామీల పేర్లతో క్వారీలు లీజులు తీసుకుని సర్కారు ఖజానాకు భారీగా సీనరేజీ, రాయల్టీని ఎగవేస్తున్నారు. ఏకంగా రూ. 974 కోట్లు సీనరేజీని ఎగవేసిన 15 మైనింగ్‌ కంపెనీలకు డిమాండ్‌ నోటీసులు జారీ చేసిన వ్యవహరాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విధితమే. మరోవైపు లాటరైట్‌, వైట్‌ క్లే, ఎర్రరాయి, ఇసుక, మొరం వంటి ఖనిజ సంపద కూడా లూటీ అవుతోంది. లీజు అనుమతులు లేకుండా, సీనరేజీలు, రాయల్టీ చెల్లించకుండా యథేచ్ఛగా ఖనిజ సంపదను దోపిడీ చేస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్‌ను అరికట్టాల్సిన భూగర్భ గనులశాఖ జిల్లా అధికారి పోస్టు తరచూ మారుతుండటంతో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారికి అడ్డే లేకుండా పోయింది. తరచూ అధికారులు మారుతుండటంతో ఆశాఖలోని కింది స్థాయి అధికారులకు కలిసొస్తుంది. అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారితో చెట్టాపట్టాలేసుకుని అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆశాఖ జిల్లా బాస్‌లు తరచూ మారుతుండటం వారికి కలిసొస్తుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement