పరిహారం ఏదీ? | - | Sakshi
Sakshi News home page

పరిహారం ఏదీ?

Nov 12 2026 11:36 AM | Updated on Nov 12 2026 11:36 AM

● మునిదేవునిపల్లిలో భూముల సర్వే అడ్డగింత

● సమాచారం లేకుండా రావడంపై రైతుల ఆగ్రహం

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: పేద రైతులకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో పంపిణీ చేసిన భూముల విషయంలో ప్రస్తుతం వివాదం నెలకొంది. పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన పేరుతో తమ భూములు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదని కొండాపూర్‌ మండలం మునిదేవునిపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం అందకముందే భూముల సర్వేకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం సర్వే బృందాన్ని అడ్డుకున్నారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 92లో అప్పట్లో సుమారు 288 ఎకరాల భూమిని ప్రభుత్వం పేదలకు అసైన్డ్‌ భూములుగా పంపిణీ చేసింది. ఈ భూములపై ఆధారపడి అనేక కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా యి. అయితే పరిశ్రమల ఏర్పాటులో భాగంగా టీజీఐఐసీ ఈ భూములను తీసుకున్నట్లు రైతులు చెబుతున్నారు. భూములు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెనుదిరిగిన సర్వే బృందం

బుధవారం కొంతమంది నాయకులు ప్రైవేటు వ్యక్తులతో కలిసి భూముల సర్వేకు వచ్చినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత రైతులు అక్కడికి చేరుకుని సర్వేను అడ్డుకున్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వేకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ముందుగా నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల అభ్యంతరాలతో సర్వే చేయకుండానే వచ్చిన బృందం వెనుదిరిగింది. పరిశ్రమల ఏర్పాటును, స్థానికులకు ఉద్యోగాల కల్పనను తాము వ్యతిరేకించడం లేదని, అయితే తమ జీవనాధారమైన భూములను కోల్పోతున్నందున న్యాయమైన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించే వరకు భూముల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement