నారాయణఖేడ్: మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్లలో చేయలేని అభివృద్ధిని మూడేళ్లలో చేసి చూపానని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజల సహకారం, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడంతోనే ఖేడ్ చుట్టూ రింగ్ రోడ్ చేపట్టామని తెలిపారు. బాణాపూర్, హుక్రాన (జి), వెంకటాపూర్ గ్రామాల పేర నిధుల దుర్వినియోగం అవాస్తవమన్నారు. ప్రజాప్రతినిధిగా తాను సంపాదించిన ఆస్తులు, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆస్తులపై ఏ విచారణకై నా తాను సిద్ధమని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ హయాంలో అక్రమ ఆస్తులు కూడబెట్టిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తనను విమర్శించడం సిగ్గు చేటన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు రాజు, లక్ష్మణ్, షారూఖ్ ఖాన్, ముంతాజ్, పండరిరెడ్డి పాల్గొన్నారు.
రాయికోడ్(అందోల్): స్మార్ట్ రేషన్‌కార్డులు లబ్ధిదారుల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య అన్నారు. మండలంలోని హస్నాబాద్, రాయిపల్లి, నాగన్‌పల్లి, సింగితం తదితర గ్రామాల్లో బుధవారం లబ్ధిదారులకు తహసీల్దార్ ఆశాజ్యోతి, నాయకులతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా తమ వంతుగా కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కేధారినాథ్ పాటిల్, ఆలయ చైర్మన్ సతీశ్‌కుమార్, నాయకులు బసవరాజ్ పాటిల్, మల్లికార్జున్ పాటిల్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బుధవారం ఆకాశ దీపోత్సవం నిర్వహించారు. అర్చకులు ఆలయ మంఠపంలో బంతి పూలతో అలంకరణ చేసి, చుట్టూ దీపాలు వెలిగించి పూజలు చేశారు.
పాపన్నపేట(మెదక్): ‘ముంచుకొచ్చిన ఎల్‌నినోతో కరువు కాలం తరుముకొస్తుంది.. ఇప్పటికై నా మేల్కొని ముందు జాగ్రత్తలు పాటించకుంటే ఆగమవుతాం’ అంటూ బుధవారం మండలంలోని సంతలో విద్యార్థులు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ఎకో క్లబ్ చెందిన సుమారు 50 మంది విద్యార్థులు కరువుపై అవగాహన కల్పించాలనుకున్నారు. ఈ మేరకు ర్యాలీగా తరలి సంతకు వెళ్లారు. నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వాడాలని, లేకుంటే ముప్పు తప్పదంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. కరువు వేళ వరి పంట వేయొద్దని కోరారు. ఇంట్లో, పబ్లిక్ కుళాయిలకు తప్పకుండా ఆన్ ఆఫ్ పరికరాలు బిగించాలని సూచించారు. ఇళ్లు కడుగకుండా, పచ్చి బట్టతో తుడువాలని విజ్ఞప్తి చేశారు. వృథా నీటిని పునర్వినియోగం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి కరపత్రాలు పంచి, ప్లకార్డులు ప్రదర్శించారు. వారి వెంట టీచర్లు అంజాగౌడ్, రమేశ్, మోహన్‌రావు తదితరులు ఉన్నారు.


