ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లా క్ స్పాట్లుగా గుర్తించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించడం, రహదారులకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు, పొదలను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. అనంతరం ఎస్‌హెచ్‌ఓలకు కేటాయించిన పోలీస్ వాహనాలను తనిఖీ చేసి వాటి నిర్వహణ, పనితీరును పరిశీలించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించి రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, ప్రభాకర్, వెంకట్‌రెడ్డి, సైదా నాయక్, డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ రమేశ్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


