● జిల్లాలో గతేడాదిని మించి పెరుగుదల
● ఎల్‌నినో భయంతో రైతుల నిర్ణయం
నారాయణఖేడ్: ఎల్‌నినో ప్రభావంతో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రచారం చేస్తుండడంతో రైతులు యాసంగిలో శనగ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో గతేడాది కంటే 10 వేల ఎకరాల్లో అధికంగా పంట సాగయ్యే అవకాశాలున్నాయి. స్వల్పకాలిక రకం అయిన ఈ పంట దిగుబడులు కూడా ప్రయోజనకరంగా ఉండడంతో రైతులు ఈ పంటవైపు మరలుతున్నారు. జిల్లాలో గతేడాది 30,908 ఎకరాల్లో శనగ సాగు చేశారు. ఈ ఏడాది 41 వేల నుంచి 50 వేల ఎకరాల వరకు రైతులు సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి తడులు లేకున్నా కురిసే మంచు ప్రభావంతోనే ఈ పంట దిగుబడులు సాధిస్తుంది.
ప్రయోజనాలెన్నో..
ఇప్పటికే పలు స్వల్పకాలిక రకాల పంటలు తీసుకున్న రైతులు శనగ పంట సాగు చేశారు. పత్తి పంట సాగుచేసిన రైతులు పత్తి తీత చివరి దశలో ఉండడంతో ఈ కమతాల్లోనూ శనగను సాగు చేసే అవకాశం ఉంది. 90 నుంచి వంద రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఈ పంట ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం మద్దతు ధరకు మించి బయటి మార్కెట్‌లో రూ.7,200 చొప్పున కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ పంటతో పాటు అంతర పంటగా నూనె గింజలైన తెల్లకుసుమ పంటను కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. ఈ పంట ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో రూ.9 వేల నుంచి రూ.10 వేలకు క్వింటాల్ చొప్పున ధర లభిస్తుంది. రెండు పంటల ప్రయోజనం ఉండడంతో రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు.
ఏటా శిఖంలో సాగు
మంజీరా శిఖంతో పాటు నిజాంసాగర్ శిఖం భూముల్లో భారీగా శనగ పంటను రైతులు సాగు చేశారు. ప్రతీసారి వేసవిలో మంజీరా, నిజాంసాగర్ శిఖంలలో నీరు ఇంకగానే తేలిన నల్లరేగడి భూముల్లో శనగ వేస్తారు. ఇప్పటికే మంజీరా పరీవాహకంలో 3 వేల ఎకరాల వరకు సాగు చేపట్టారు. మరో 2 వేల ఎకరాల వరకు సాగు పెరిగే అవకాశం ఉంది. నిజాంసాగర్ శిఖం అయిన రాంరెడ్డిపేట, ఖానాపూర్ (బి), దామర్‌చెరువు, కొత్తపల్లి, నిజాంపేట, జంబికుంట, కామారెడ్డి జిల్లా పరిధిలోని పెద్ద ఆరేడు, మర్పల్లి, లింగంపల్లి, మెదక్ జిల్లా పరిధిలోని చీలపల్లి, ఆరేపల్లి, ఉత్తులూరు, కొత్తపల్లి, నారాయణపేట్ శివారుల్లోని శిఖంలో ఇప్పటికే వెయ్యి ఎకరాల వరకు సాగు చేపట్టగా, మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.


