కొల్చారం(నర్సాపూర్): జీవన ఎరువుల వాడకంతో భూమి సారం, పంట దిగుబడి పెరుగుతుందని భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఉమాకాంత్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని రంగంపేటలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమాకాంత్, మరో శాస్త్రవేత్త సేవా నాయక్ హాజరై మాట్లాడారు. మట్టి నమూనా సేకరణ, పరీక్షల ద్వారా కలిగే లాభాలను సమగ్రంగా వివరించారు. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతిలో భాగంగా పచ్చి రొట్టె ఎరువులు, జీవన ఎరువులు వాడుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల యాసంగిలో వరికి బదులుగా, తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలు జొన్న, మొక్కజొన్న, శనగ, పొద్దు తిరుగుడును సాగు చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ప్రతాప్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్వేత, ఏఈఓ స్రవంతి, ఉప సర్పంచ్ సురేశ్, రైతులు పాల్గొన్నారు.


