వృద్ధుడి మృతి
తూప్రాన్: దీపావళి పండుగ వేళ మనోరాబాద్ మండలం పర్కిబండ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు వెలిగించిన దీపం అంటుకొని వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎస్‌ఐ సుభాష్ గౌడ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వృద్ధుడు నిమ్మల మల్లేశ్(70) దివ్యాంగుడు. దీపావళి రోజు ఇంటి ముందు ప్రమిదలతో దీపాలు వెలిగించి పెట్టారు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆయన కట్టుకున్న లుంగీకి దీపపు మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటల్లో మల్లేశ్ తీవ్రంగా కాలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి, ఆయనను హుటాహుటిన తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, సికింద్రాబాద్‌లోని గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మల్లేశ్ మృతి చెందినట్లు ఎస్‌ఐ సుభాష్ గౌడ్ ఽతెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
స్పృహ కోల్పోయి వ్యక్తి..
పటాన్‌చెరు టౌన్: వ్యక్తి స్పృహ కోల్పోయి మృతి చెందాడు. ఈ ఘటన ఇస్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేశ్ వివరాల ప్రకారం.. పటాన్‌చెరు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన చేనగల పర్వతాలు (50) కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. భార్య రేణుక ఓ కంపెనీలో పనిచేస్తుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆమె విధులకు వెళ్లింది. ఇంద్రేశంలో ఓ వ్యక్తి రూ.4 వేల బాకీ ఉన్నాడని, ఆ డబ్బులు తీసుకొచ్చేందుకు వెళ్తున్నట్లు భార్యకు ఫోన్‌న్‌లో తెలిపాడు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో ఇంద్రేశంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న కల్లు కాంపౌండ్ సమీపంలో పర్వతాలు స్పృహ కోల్పోయి పడిపోయాడు. స్ధానికులు 108లో పటాన్‌న్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తామరపూల కోసం చెరువులోకి వెళ్లి..
సిద్దిపేటకమాన్: తామర పూల కోసం చెరువులోకి వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన దుర్గాప్రసాద్ (36) ఎలక్ట్రీషియన్, కూలీ పనులు చేస్తూ... భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి స్థానిక నల్లపోచమ్మ నగర్‌లో ఉంటున్నాడు. ఈ నెల 6న సిద్దిపేటకు చెందిన పూలు విక్రయించే సయ్యద్, దుర్గాప్రసాద్‌ను, మస్తాన్‌ను తీసుకుని తామర పూల కోసం కోమటి చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో దుర్గాప్రసాద్, మస్తాన్ ఇద్దరు పూలు కోయడానికి చెరువులోకి దిగారు. కాగా దుర్గాప్రసాద్‌కు ఈత రావడంతో ఎక్కువ దూరం వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులోపల ఉన్న వేర్లు చుట్టుకొని ఊపిరాడక ఒడ్డుకు రాలేకపోయాడు. మస్తాన్ ఒడ్డుకు చేరుకున్నాడు. దుర్గాప్రసాద్ బయటకు రాకపోవడంతో ఒడ్డుపై ఉన్న ఇద్దరు వ్యక్తులు భయపడి ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దుర్గాప్రసాద్ ఇంటికి రాకపోవడంతో అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయం చెరువులో అతడి మృతదేహం నీటిపై తేలి కనిపించింది. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి మార్చురీకి తరలించారు.
రైల్వే ట్రాక్‌పై వ్యక్తి మృతదేహం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం కీమెన్ జితేశ్ రైలు పట్టాలను తనిఖీ చేస్తున్న సమయంలో తెల్లాపూర్, లింగంపల్లి రైల్వే స్టేషన్ మధ్యలో రైల్వేట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉండటంతో రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడి వయస్సు 45ఏళ్లు ఉంటాయని, మొలదారానికి తాళం చెవి ఉన్నట్లు తెలిపారు. మృతుడి ఒంటిపై ఎరుపు రంగు రౌండ్ నెక్ టీషర్ట్, నలుపు రంగు లోయర్ ధరించి ఉన్నాడు. మృతుడు గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని లేదా రైలు ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎవరికై నా మృతుడి వివరాలు తెలిస్తే వెంటనే వికారాబాద్ రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.


