● రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి ● తల్లి, కొడుకుకు తీవ్రగాయాలు
హుస్నాబాద్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మరణించగా, తల్లి,కొడుకుకు గాయాలయ్యాయి. ఈ ఘటన మండలం పందిల్ల జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపెల్లి శ్రీకాంత్(33) కూతురు మహాన్వి(7) భార్య స్వాతి, కుమారుడు శ్రీహాన్‌లతో కలిసి హైదరాబాద్‌లో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొండాపూర్‌లో దగ్గరి బంధువు దశదినకర్మకు రావడానికి తన కారు లేకపోవడంతో మరో కారులో కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నాడు. పందిల్ల శివారులో పోచమ్మ దేవాలయం సమీపంలో ట్రాక్టర్, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు నుజ్జు నుజ్జు కావడంతో శ్రీకాంత్, కూతురు మహాన్వి అక్కడికక్కడే మరణించారు. సీఐ శ్రీధర్, ఎస్సై లక్ష్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లి స్వాతి, కొడుకు శ్రీహాన్‌లను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ మృతదేహం కారులో ఇరుక్కుపోవడంతో తాళ్ల సహాయంతో కారు డోర్లను తెరిచి బయటకు తీశారు. కూతురు మృతదేహం వద్ద తల్లి రోదిస్తుంటే అటుగా వెళ్లే వారు సైతం అయ్యో పాపం అంటూ కన్నీరు పెట్టారు. మృతుడి తమ్ముడు పైడిపెల్లి సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృత దేహలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
బైక్ ఢీకొట్టడంతో ఆర్మీ జవాన్..
గజ్వేల్: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. ఈ ఘటన జగదేవ్‌పూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. యాదాద్రి–భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మహేందర్(24) భారత సైన్యంలో పనిచేస్తున్నాడు. గత నెల 18న స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి ఈనెల 19న విధుల్లో చేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే సోమవారం మహేందర్ పనిమీద తన స్వగ్రామం నుంచి జగదేవ్‌పూర్ మండల కేంద్రానికి బైక్‌పై వచ్చాడు. పని ముగించుకొని తిరిగి తన గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి కొమురవెళ్లి దర్శనానికి ఆరుగురు వ్యక్తులు 3 బైకులపై వస్తున్నారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా పసాల గ్రామానికి చెందిన కృష్ణయ్య, రామలింగప్ప ఒక ద్విచక్ర వాహనంపై వస్తూ.. పీర్లపల్లి వద్ద ఎదురుగా వస్తున్న మహేందర్‌ను ఢీకొట్టారు. దీంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స పొందుతూ మహేందర్ కన్నుమూశాడు. రామలింగప్ప, కృష్ణయ్యకు గాయాలయ్యాయి. రామలింగప్పను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


