మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
చిన్నశంకరంపేట(మెదక్): పొలం అమ్మిన డబ్బులు ఇవ్వకపోవడంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. నార్సింగి ఏఎస్‌ఐ రవీందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మన్నే భూమయ్య(60) వ్యవసాయ కూలిగా జీవిస్తున్నాడు. తన ఇద్దరు కూతుర్ల వివాహాలు చేశాడు. ఈ క్రమంలో తన సోదరుడు బాలయ్యకు పొలం అమ్మగా రూ.3 లక్షలు ఇవ్వాల్సి ఉంది. నగదు ఇవ్వకపోగా తన పూరి గుడిసెను తొలగించి ఇల్లు నిర్మిస్తానని చెప్పడంతో వీరు అద్దె ఇంట్లోకి వెళ్లారు. దీంతో 40 గజాల ఖాళీ స్థలాన్ని సోదరుడు ఇతరులకు విక్రయించాడు. ఇదేమని అడిగితే సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన భూమయ్య సోమవారం గ్రామశివారులోని కుంట వద్ద చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు.
రైలు కిందపడి వ్యాపారి..
అప్పులు తీర్చలేక వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని మిర్జాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే ఎస్‌ఐ లింబాద్రి కథనం ప్రకారం.. రామాయంపేట మండలం ఆర్.వెంకటపూర్‌కి చెందిన బొమ్మర్ల రాజేందర్(44) గ్రామంలో కిరాణం దుకాణం నడుపుతూ జీవిస్తున్నాడు. ఇటీవల ఇంటి నిర్మాణం కోసం రూ.9 లక్షల హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ఇతర అవసరాలకు మరో రూ.20 లక్షల వరకు ఇతరుల వద్ద అప్పు చేశాడు. అప్పులు తీర్చలేక మనోవేదనకు గురైన రాజేందర్ మూడు రోజుల క్రితం ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలోనే కాచిగూడ నుంచి రైలులో మిర్జాపల్లి వచ్చిన ఆయన నిజామాబాద్ వైపు నుంచి వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు 13 ఏళ్ల పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


