● ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్ ● ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
న్యాల్కల్(జహీరాబాద్): పొగ మంచు వల్ల రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన మండల పరిధిలో సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ సుజిత్ కథనం ప్రకారం.. న్యాల్కల్కు చెందిన బొల్లి శ్రీకాంత్(19), ఎరుకల సాయి కిరణ్(21) ఇద్దరు జహీరాబాద్ సమీపంలో గల మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే సోమవారం తెల్లవారు జామున బైక్‌పై పరిశ్రమకు బయలు దేరారు. ఈ క్రమంలో న్యామతాబాద్ గ్రామ శివారులో అల్లాదుర్గం–మెటల్‌కుంట రోడ్డుపై నిలిపిన లారీని ఢీకొట్టారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో శ్రీకాంత్ మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సాయి కిరణ్‌ను జహీరాబాద్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం యువకుని పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారు జామున పొగ మంచుతో రోడ్డుపై నిలిపిన లారీ కనిపించక పోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పలువురు పేర్కొంటున్నారు. మృతుడు శ్రీకాంత్‌తో పాటు తీవ్ర గాయాలైన సాయికిరణ్‌కు వివాహం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


