ములుగు(గజ్వేల్): మండలంలోని తానెదార్‌పల్లి, తండా గ్రామాలకు కేటాయించిన హనుమాన్ ఆలయ స్థలాన్ని కాపాడాలని దీక్ష చేస్తున్న గ్రామస్తులకు సోమవారం బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన కార్యదర్శి జుబేర్‌పాష, మాజీ ఎంపీటీసీ లింగారెడ్డి తదితరులు దీక్ష శిబిరాన్ని సందర్శించి గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ రెండు గ్రామాల ప్రజలు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించి ప్రభుత్వ నిధులతో కొంతమేర నిర్మాణం పనులు చేపట్టారని తెలిపారు. అయితే వివిధ కారణాలతో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిందన్నారు. కాగా విలువైన ఆలయ స్థలాన్ని స్థానిక అధికార పార్టీ నాయకులు రెవెన్యూ అధికారుల సహకారంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ చర్యతో ఆలయ నిర్మాణానికి ఆటంకం కలగడమే కాకుండా రెండు గ్రామాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి గజ్వేల్ ఆర్డీఓతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు.


