ఇద్దరికి తీవ్ర గాయాలు
జహీరాబాద్: మండలంలోని హుగ్గెల్లి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై శనివారం అదుపుతప్పి కారు బోల్తా పడింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని మన్నెల్లికి వెళ్తున్న క్రమంలో కారు అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. ఈ క్రమంలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో సిద్దన్న, మొగులప్ప గాయపడ్డారు. వీరిని 108లో ప్రథమచికిత్స అందించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సంగారెడ్డి: పట్టణంలోని బ్లింకిట్ ఆన్‌లైన్ మార్కెట్‌లో జిల్లా ఆహార భద్రతాధికారులు శనివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో విక్రయిస్తున్న వివిధ ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పప్పులు, మైదా తదితర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించనున్నట్లు జిల్లా ఆహార భద్రతాధికారి రాజేశ్వర్ తెలిపారు. ఆహార భద్రతా నిబంధనల ప్రకారం మార్కెట్ యజమానికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రయోగశాల పరీక్షల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
రేగోడ్(మెదక్): మండలంలోని ఓ హాస్టల్‌లో శనివారం ఉదయం ఓ విద్యార్థిని గాయపడటంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే హాస్టల్ సిబ్బంది అంబులెన్స్‌కు సమాచారం అందించినట్లు తెలిసింది. శనివారం తెల్లవారుజామున 3 గంటల 42 నిమిషాలకు ఫోన్ రావడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది విద్యార్థినిని మొదట రేగోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే విద్యార్థినికి గాయం ఎలా జరిగింది? హాస్టల్‌లో ఏం జరిగింది? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
● పప్పులు, మైదా నమూనాల సేకరణ
● యజమానికి నోటీసులు
● తెల్లవారుజామున విద్యార్థినికి గాయం
● 108లో రేగోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు


