రామాయంపేట(మెదక్): దీపావళి పండుగ వేళ వెలుగులు విరజిమ్ముతుంటే, నిరుపేదల జీవితాలు మాత్రం చీకట్లోనే మగ్గుతున్నాయి. పండుగ వేళ అందరూ కొత్త దుస్తులు ధరించి బాణసంచాలు కాలుస్తుంటే, రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు మాత్రం పొట్ట చేతపట్టుకొని దేశ సంచారం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా గుడిసెలు వేసుకొని చిన్న , చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన బుడగ జంగాలకు చెందిన పది కుటుంబాలు రెండు నెలల క్రితం తమ గ్రామాన్ని వదిలి కుటుంబాలతోపాటు రామాయంపేటకు వలస వచ్చి పట్టణ శివారులో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ఇనుప మంచాలు అమ్ముతూ జీవిస్తున్నామని, తమ వ్యాపారానికి సరైన ఆదరణ కరువై తిండికి అలమటిస్తున్నామని వాపోయారు. ఏడాదిలో రెండు నెలలు మాత్రమే స్వస్థలాల్లో ఉంటున్నామని, మిగతా పది నెలలు దేశ సంచారానికే పరిమితమవుతున్నామని చెప్పారు. పండుగల వేళ తాము అర్ధాకలితోనే గడపాల్సి వస్తుందన్నారు.


