జహీరాబాద్: చెరుకు పంటకు గిట్టుబాటు ధర ప్రకటించాలని కోరుతూ రైతులు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలోని కర్మాగారాలు ఇచ్చే ధర అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన బాట పట్టేందుకు గాను శనివారం జహీరాబాద్లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందులో పలు అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని యోచిస్తున్నారు. టన్నుకు రూ.4వేల ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో టన్నుకు రూ.3,300 ధర చెల్లించడంతో పాటు చెరుకు కోత, రవాణ ఖర్చులను భరించేందుకు యాజమాన్యాలు ముందుకు వచ్చినట్లు తెలిసింది. ఇక్కడ టన్నుకు చెరుకు కోత, రవాణ ఖర్చులు పోను రూ.3,100 దాటడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో చక్కెర క్వింటాలుకు రూ.5,500 ధర పలుకుతోందని గుర్తు చేస్తున్నారు. ఈ లెక్కన టన్నుకు రూ.4,500 ధర చెల్లించినా తక్కువే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా అనుసరించాల్సిన విధానాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు.
గిట్టుబాటు ధర కోసం నేడు కార్యాచరణ


