నత్తనడకన ‘విస్తరణ’ | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన ‘విస్తరణ’

Nov 7 2026 10:11 AM | Updated on Nov 7 2026 10:11 AM

వెనక్కి తగ్గబోం

జహీరాబాద్‌ రోడ్ల విస్తరణ పనుల్లో జాప్యం

జహీరాబాద్‌ పట్టణంలోని రోడ్ల విస్తరణ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. దాదాపు రెండు నెలలు కావొస్తున్నా మొక్కుబడిగా పనులు సాగుతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనుమాన్‌ మందిరం రహదారిపై 60 శాతం మేర కట్టడాలు తొలగించే పనులు పూర్తయ్యాయి. మిగితా పనులు మందకొడిగా సాగడం, పలువురు విస్తరణకు అభ్యంతరం తెలుపుతూ కోర్టును ఆశ్రయించడంతో మరింత జాప్యం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హనుమాన్‌ మందిర్‌, భవానీమందిర్‌, లతీఫ్‌ రోడ్లను 40 ఫీట్ల వంతున విస్తరించాలని నిర్ణయించారు. 40 ఫీట్ల రహదారికి వదిలి ఇరువైపులా 5 ఫీట్ల వంతున సెట్‌ బ్యాక్‌ తీసుకొని కట్టడాలు తొలగించుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 5 ఫీట్ల స్థలంలో మురికి కాలువ నిర్మాణంతో పాటు వ్యాపార సంస్థలకు వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం ఉపయోగపడుతుందని అధికారులు సూచించారు. వ్యాపారులు మాత్రం 40 ఫీట్లకే కట్టడాలను తొలగించుకుంటున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొందరు మాత్రమే 5 ఫీట్ల వంతున సెట్‌ బ్యాక్‌ తీసుకొని కట్టడాలు చేపడుతున్నారు. విస్తరణ పనులు మందకొడిగా సాగుతుండడంతో ఆయా రహదారులపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు వాపోతున్నారు.

రాజకీయ ఒత్తిళ్లే కారణమా?

రాజకీయ ఒత్తిడి కారణంగానే రోడ్ల విస్తరణ పనులు మందగించానే ఆరోపణలున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు దుకాణాల యజమానులకు మద్ధతుగా నిలుస్తున్నారనే విమర్శలున్నాయి. రహదారులను ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగించే విషయంలో ఎంతటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా వెనక్కి తగ్గవద్దంటూ ప్రజల వైపు నుంచి వాదన వినిపిస్తోంది. రాజకీయ నేతల జోక్యాన్ని అధికారులు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవద్దనే అభిప్రాయం ప్రజల వైపు నుంచి వ్యక్తం అవుతోంది. ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరేందుకు వీలుగా చేపట్టిన రోడ్ల విస్తరణ ప్రశంసనీయమైనదే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రాజకీయ పలుకుబడితో విస్తరణ పనులకు ఆటంకం కలిగించే నేతల తీరు పట్ల ప్రజల పైపు నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

పలువురు స్వచ్ఛందంగా కట్టడాల తొలగింపు

మరికొందరు తొలగించుకునేందుకు నిరాసక్తత

వెనక్కి తగ్గబోమంటున్న అధికారులు

రెండు నెలల క్రితం జహీరాబాద్‌ పట్టణంలోని పలు రోడ్ల విస్తరణకు మున్సిపల్‌ అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్‌ 15 నుంచి వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆక్రమణలను తొలగించుకునే పనులు చేపట్టారు. దీంతో భవానీ మందిర్‌, హనుమాన్‌ మందిర్‌, లతీఫ్‌ రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో పనులు పూర్తి కాలేదు. రాజకీయ ఒత్తిళ్లతోనే జాప్యం జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. – జహీరాబాద్‌

రోడ్ల విస్తరణకు గాను చేపట్టిన మాస్టర్‌ ప్లాన్‌ యధావిధిగా కొనసాగుతుంది. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదు. త్వరలో రహదారులపై మిగిలిపోయి ఉన్న దుకాణాలను తొలగిస్తాం. కోర్డుకు వెళ్లిన వారిని సైతం కలిసి వారిని సమాధానపరిచి పనులను ముందుకు తీసుకెళతాం. ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గబోం. – శ్రీనివాస్‌రావు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, జహీరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement