హుస్నాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..ప్రాజెక్టులకు అవసరమైన నిధులు మంజూరుతోపాటు, సుప్రీంకోర్టులో ఉన్న కేసును క్లియరెన్స్ చేసుకున్నామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేశామని, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. గౌరవెల్లి, గండిపల్లి కవల ప్రాజెక్టులను పూర్తి చేసి గండిపల్లి ద్వారా 14 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. గతేడాది హుస్నాబాద్ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ప్రస్తుతం మరో 2వేల ఇళ్లు రానున్నాయని తెలిపారు. ఈ దీపావళి పండుగకు ఇళ్ల లబ్ధిదారులతో కలిసి వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. దీపావళి తర్వాత నియోజకవర్గంలోని 136 ధాన్యం కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నెల 16 నుంచి మండలాల వారీగా దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లాలో చిలుకపచ్చ రంగులో చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. అదే సభా వేదికపై ప్రతీ ఒక్కరికి రూ.5లక్షల ఇందిరమ్మ భీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.
ఇంజనీరింగ్ కళాశాలను
ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతాం
హుస్నాబాద్ శాతావాహన ఇంజనీరింగ్ కళాశాలను రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణంలోని లక్ష్మిగార్డెన్‌లో శుక్రవారం ఇంజనీరింగ్ కళాశాల కొత్త విద్యార్థుల పరిచయ వేడుక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రథమ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధికి ల్యాప్ టాప్ అందజేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యేలోగా విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ వచ్చేలా ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు.
దీపావళి రోజున ఇందిరమ్మ ఇళ్లల్లో వేడుకలు
చీరల పంపిణీ, రూ.5లక్షల
బీమా ప్రారంభం
మంత్రి పొన్నం ప్రభాకర్


