జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్
చలపతిరావు
సంగారెడ్డి జోన్: ఇందిరమ్మ పథకంలో నిర్మించుకున్న ఇళ్లలో జిల్లావ్యాప్తంగా ఈనెల 8న దీపావళి వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చలపతిరావు తెలిపారు. పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ, ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో పథకాన్ని అమలు చేస్తోందన్నారు. జిల్లాలో మొత్తం 14,445 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 6,617 ఇళ్లు పూర్తయ్యాయని వివరించారు. 7,828 ఇళ్లు వివిధ దశలలో ఉన్నట్లు చెప్పారు. పూర్తయిన ప్రతి ఇందిరమ్మ ఇంటి ముందు గోడపై మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి లోగో స్టిక్కరింగ్తో పాటు లబ్ధిదారుల వివరాలను పెయింటింగ్ వేస్తామన్నారు. పండగ రోజు లబ్ధిదారులు కుటుంబ సభ్యులతో కలిసి నూతన ఇందిరమ్మ ఇంటి ఎదుట దీపాలు వెలిగించి, కుటుంబ సభ్యులతో ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
హత్నూర(సంగారెడ్డి): ‘వీబీజీరాంజీ’ పథకంలో ఎక్కువ కూలీలకు పని కల్పించి హత్నూర మండలం జిల్లాలోనే ఆదర్శంగా నిలిచిందని డీఆర్డీఏ అదనపు పీడీ బాలరాజ్ అన్నారు. శుక్రవారం హత్నూర రైతు వేదికలో 17వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో 10 గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులను అభినందించి సర్టిఫికెట్లు అందించారు. ఏడాది కాలంలో 4.33 కోట్ల పనులను పూర్తిచేసేందుకు జిల్లాలో ఎక్కువ కూలీలు పనిచేసిన మండలముగా హత్నూర గుర్తింపు పొందిందన్నారు. కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న పొరపాట్లు వెలుగు చూశాయని, వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ మధులత, ఇన్చార్జి ఎంపీడీఓ యూసుఫ్, ఏఈపీఆర్ శశిధర్, ఏపీఓ ప్రవీణ్, పలు గ్రామాల సర్పంచ్‌లు, కూలీలు పాల్గొన్నారు.
పటాన్చెరు టౌన్: ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పురుషుల డిగ్రీ కళాశాలలో ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్– యూత్ పార్లమెంట్’ జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’ అంశంపై విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పోటీల్లో మొదటి బహుమతిని సంగారెడ్డి గిరిజన గురుకుల లా కళాశాల విద్యార్థి శివకుమార్, రెండో బహుమతిని పెద్దకంజర్ల గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థి బల్భీం, మూడో బహుమతిని తారా డిగ్రీ కళాశాల విద్యార్థిని మాల్వీనా గెలుచుకున్నారు. జిల్లా యువజన అధికారి రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని, అక్కడ ప్రతిభ చూపితే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ డాక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సునీలా, అధ్యాపకులు పాల్గొన్నారు.
అల్లాదుర్గం(మెదక్): పేదలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి సుచరిత అన్నారు. శుక్రవారం స్థానిక కోర్టులో జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చట్టపరమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు, చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలని సూచించారు. మండల లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, ఆర్థిక స్థోమత లేని పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


