సంగారెడ్డి జోన్: ఎల్‌నినో పరిస్థితులు, రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించి, ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ పాండు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షపాతం లోటు ఏర్పడే అవకాశాలు ఉన్నందున రాబోయే వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. తాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అందుబాటులో ఉన్న భూగర్భ, ఉపరితల నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. ఈనెల 15 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లావ్యాప్తంగా తాగునీటి సరఫరా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా గ్రామాలల్లోని తాగునీటి సరఫరా వ్యవస్థలు, పైపులైన్లు, నీటి వనరులు, పంపులు, మోటార్ల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. లీకేజీలు, మరమ్మతులు అవసరమైన ప్రాంతాలు, సరఫరాలో ఉన్న లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు వృథా కాకుండా ఒడిసిపట్టి భూగర్భజలాలను పెంపొందించుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ జైభీం, భూగర్భజలాల అభివృద్ధి శాఖ డీడీ మోహన్, ఆర్‌బబ్ల్యూఎస్ ఎస్‌ఈ పాషా, మిషన్ భగీరథ్ గ్రిడ్ ఈఈ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పాండు


