నారాయణఖేడ్: హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడాపాఠశాల గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్ –19 ఆర్చరీ ఇండియన్ రౌండ్ విభాగంలో ఖేడ్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి తరుణ్ కాంస్య పతకం సాధించారు. కాగా డిసెంబరు 19న మహారాష్ట్రలోని అమరావతిలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్టు పాఠశాల హెచ్‌ఎం మన్మధ కిశోర్ తెలిపారు. 2024 –25 విద్యాసంవత్సరంలో పాఠశాలలో పదో తరగతి చదివిన తరుణ్ తన తండ్రి జనార్దన్ ప్రోత్సాహంతో క్రీడల్లో ప్రతిభ చాటాడని పేర్కొన్నారు. విద్యార్థిని ఉపాధ్యాయులు యాదగిరి, రాజశేఖర్, చంద్రశేఖర్, పీడీ సంగ్రాం అభినందించారు.
సిద్దిపేటజోన్ /గజ్వేల్‌రూరల్: అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్దిపేట యువకులు ఎంపికయ్యారు. మహబుబ్ నగర్‌లో జరిగిన క్రికెట్ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టులో ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట యువకులు చేతన్ నిఖిల్, అభిరామ్ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ మల్లికార్జున్ వారిని అభినందించారు.
దుబ్బాకటౌన్: దౌల్తాబాద్ మండలంలో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్‌ను జిల్లా నిర్వహణ అధికారి నరేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న అత్యవసర మందులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్ సదుపాయాలతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం 108 సిబ్బంది అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో స్పందించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అంబులెన్స్‌లో అవసరమైన మందులు, పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మెడికల్ టెక్నీషియన్ దేవేందర్, పైలట్ నర్సింహులు పాల్గొన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): యువతి అదృశ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం స్థానిక ఎస్‌ఐ నీరేశ్ వివరాల ప్రకారం.. మండలంలోని కొట్టాల గ్రామానికి చెందిన దువ్వూరి వెంకటేశం చిన్నకూతురు వైష్ణవి(19) ఇంట్లో బట్టలు ఉతికిన అనంతరం బయట ఆరబెడతానని చెప్పి వెళ్లింది. తిరిగి ఇంట్లోకి రాలేదు. కొద్దిసేపటికి గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా గ్రామానికి చెందిన ఓ యువకునిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్‌ఐ నీరేశ్ కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, రాములు ఇద్దరు పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్నారు. కాగా ధర్మాసాగర్‌గేట్ వద్ద ఇసుక లోడ్‌తో ఉన్న టిప్పర్ ఓ షాపు వద్ద ఖాళీ చేస్తుండగా ఇసుక అనుమతులు, వేబిల్ చూపించాలని కానిస్టేబుల్స్ అడిగారు. టిప్పర్ డ్రైవర్ వద్ద ఎలాంటి పేపర్లు లేకపోవడంతో టిప్పర్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.


