పటాన్‌చెరు టౌన్: తప్పిపోయిన ఇద్దరు బాలురను పటాన్‌చెరు పోలీసులు 12 గంటల్లోనే గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ఇంద్రేశంకు చెందిన సాయిచరణ్ కుమారులు హర్ష్ (13), దక్ష్ (11) ఈ నెల 5న సాయంత్రం 4 గంటలకు పటాన్‌చెరు వెంకటేశ్వర కాలనీలోని నానమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ రవీందర్, ఎస్‌ఐ వినోద్ పర్యవేక్షణలో ప్రత్యేక చర్యలు చేపట్టి.. బాలుడు హర్ష్ తీసుకెళ్లిన ఫోన్ ఆధారంగా లొకేషన్‌ను ట్రేస్ చేసి మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వేగవంతమైన చర్యలపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు


