డీఎస్‌ఓ బాల సరోజ
జహీరాబాద్ టౌన్: ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బాల సరోజ హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయంలో గురువారం బియ్యం విక్రయదారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బీపీటీ, కేఎన్‌ఎం రకం సన్నబియ్యం కిలో గరిష్టంగా రూ. 66, తెలంగాణ సోనా రూ. 74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ కిలో రూ.79కు మించి విక్రయించరాదన్నారు. ఈ ధరలు వినియోగదారలుకు స్పష్టంగా కనిపించేలా దుకాణాల్లో ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. ఇక నుంచి తనిఖీలు చేపడతామని, గరిష్ట ధరల కంటే ఎక్కువకు విక్రయాలు చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమంగా బియ్యం నిల్వలు చేస్తే గోదాంల తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ చేపడుతామన్నారు. సమావేశంలో తహసీల్దార్ దశరత్, ఇన్‌స్పెక్టర్ సాయన్న, పౌరసరఫరాల శాఖ అధికారి బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.


