ప్రయాణం భయం భయం రైల్వే బ్రిడ్జిల వద్ద ప్రమాద ఘంటికలు మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట రైల్వేలైన్ పొడవునా ఇదే దుస్థితి రైల్వే, ఆర్‌అండ్‌బీ శాఖల మధ్య సమన్వయలోపం రోడ్ల దుస్థితిపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం
రైల్వే బ్రిడ్జిల వద్ద అప్రోచ్ రోడ్లు చిధ్రమై ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఆదమరిచి వాహనాలు నడిపితే ప్రమాదం తప్పని దుస్థితి. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా.. లోపాలను సవరించడంలో రైల్వే శాఖ, ఆర్‌అండ్‌బీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట వరకు సుమారుగా 78కిలోమీటర్ల పొడవునా ఇదే దుస్థితి నెలకొంది. ఈ రోడ్ల దుస్థితిపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుండగా, తరుచూ ఆందోళన కార్యక్రమాలుజరుగుతున్నాయి. – గజ్వేల్
అధ్వానంగా అప్రోచ్ రోడ్లు
మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం జరుగుతుండగా.. రూ. 1160.47కోట్లను వెచ్చిస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్ కీలక మలుపుగా మారనుంది. ప్రస్తుతం మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి గజ్వేల్ మీదుగా సిద్దిపేట వరకు రైల్వేలైన్ పనులు పూర్తికాగా రైలు కూడా నడుస్తోంది. ఈ లైన్‌పై నిర్మించిన ఆర్‌యూబీ(రైల్ అండర్ బ్రిడ్జి)ల వద్ద అప్రోచ్ రోడ్లు, బ్రిడ్జిల కింద ఉన్న సీసీ రోడ్ల పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నది.
పలు ప్రదేశాల్లో ఇలా..?
ప్రధానంగా నాచారం గుట్ట సమీపంలోని వేలూరు వద్ద, తూప్రాన్ మండలం మల్కాపూర్ వద్ద, గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి వద్ద చేగుంట మార్గంలో, గజ్వేల్–సిద్దిపేట రోడ్డు మార్గంలో వీ–మార్ట్ సమీపంలో, క్యాసారం రింగురోడ్డు వద్ద, కుకునూర్‌పల్లి, లకుడారం, కొమురవెల్లి, దుద్దెడ వద్ద ఆర్‌యూబీలను నిర్మించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా రోడ్లను నాలుగులేన్లు విస్తరించి బ్రిడ్జిలను నిర్మించారు. బ్రిడ్జి కింద రోడ్లను సీసీతో నిర్మించారు. ఈ రోడ్ల పనులు నాసిరకంగా సాగటం ప్రస్తుతం చిధ్రమయ్యాయి. ప్రత్యేకించి ధర్మారెడ్డిపల్లి దాటిన తర్వాత ఉన్న బ్రిడ్జి వద్ద పరిస్థితి భయానకంగా మారింది. ఇక్కడి అప్రోచ్ రోడ్డుకు భారీ గుంతలు ఏర్పడ్డాయి. బ్రిడ్జి కింద ఉన్న రోడ్డు నాణ్యతాలోపం కారణంగా ఇనుపచువ్వలు తేలి..ప్రమాదఘంటికలను మోగిస్తున్నది. నాచారంగుట్ట సమీపంలోని వేలూరు వద్ద కూడా ఇదేరకమైన పరిస్థితి ఉంది. తూప్రాన్ మండలం మల్కాపూర్ వద్ద నిర్మించిన బ్రిడ్జి వంకర్లు తిరిగి ఉన్నది.
సమన్వయలోపమే కారణం..
అప్రోచ్ రోడ్ల దుస్థితి, రైల్వే బ్రిడ్జిల వద్ద ప్రమాద ఘంటికల నివారణలో రైల్వే, ఆర్‌అండ్‌బీ శాఖల సమన్వయలోపం బయటపడుతోంది. గతంలో ఈ అంశాలపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షల్లో రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు నాసిరకంగా సాగి...బ్రిడ్జిల కింద నిర్మించిన రోడ్లు రైలు రాకముందే ధ్వంసమయ్యాయని ఆర్‌అండ్‌బీ అధికారులు వాదించారు. మేం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బ్రిడ్జిల వద్ద రోడ్లను నాలుగు లేన్లుగా నిర్మించామని అందువల్ల కొన్ని సమస్యలు వచ్చాయని రైల్వే శాఖ వాదించింది. ఎవరి వాదన ఎలా ఉన్నా.. రోడ్లు, బ్రిడ్జిల దుస్థితి మాత్రం మారలేదు. కొన్నిచోట్ల పంచాయతీరాజ్ శాఖకు చెందిన అప్రోచ్ రోడ్లు కూడా దెబ్బతిని ఉన్నాయి. ఈ రోడ్ల దుస్థితిపై తరుచూ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ధర్మారెడ్డిపల్లి వద్ద బుధవారం ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు కూడా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
బాగు చేయిస్తాం
రైల్వే బ్రిడ్జిల వద్ద ఉన్న మా ఆర్‌అండ్‌బీ అప్రోచ్ రోడ్లను బాగుచేయిస్తాం. త్వరలోనే పనులు చేపడతాం. బ్రిడ్జి కింద సీసీ రోడ్లు దెబ్బతింటే ఉంటే రైల్వే శాఖ మరమ్మత్తులు చేపట్టాల్సి ఉన్నది.
– నిఖిత, డిప్యూటీఈఈ గజ్వేల్ అర్‌అండ్‌బీ


