పటాన్‌చెరు టౌన్: పట్టణంలోని వేంకటేశ్వర కాలనీలో ఇద్దరు అన్నదమ్ములు అకస్మాత్తుగా అదృశ్యమైన విషాద ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వినోద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రేశానికి చెందిన సాయిచరణ్‌కు ఇద్దరు కుమారులు హర్ష్ (13), దక్షు (11) ఉన్నారు. పెద్ద కుమారుడు హర్ష్ ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్దకంజర్ల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా, చిన్న కుమారుడు దక్షు పటాన్‌చెరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి అభ్యసిస్తున్నాడు. చిన్న కుమారుడు దక్షు పటాన్‌చెరులోని వేంకటేశ్వర కాలనీలో నానమ్మ మందాకిని వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 1న పెద్ద కుమారుడు హర్ష్ కూడా హెయిర్ కటింగ్ కోసం వేంకటేశ్వర కాలనీలోని నానమ్మ ఇంటికి వచ్చాడు. కాగా, ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఇద్దరు కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. రాత్రి 8 గంటలైనా పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన నానమ్మ వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. బంధువులు, స్నేహితుల ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో గాలించినా బాలుర ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం తండ్రి సాయిచరణ్ పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.


