కొండాపూర్ (సంగారెడ్డి): భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కొండాపూర్ మండల పరిధిలోని మల్లేపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై సోమేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన బోయిని నాగరాజుకు అతని భార్య సుజాతకు మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్పర్ధలు తీవ్రమై మూడేళ్ల క్రితం సుజాత భర్తను విడిచిపెట్టి గొల్లపల్లిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, 20 రోజుల క్రితం ఇరువైపుల కుటుంబ పెద్దలు సమక్షంలో పంచాయితీ నిర్వహించి నచ్చజెప్పడంతో సుజాత తిరిగి మల్లేపల్లిలోని భర్త వద్దకు వచ్చింది. అయినప్పటికీ ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగరాజు నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో పడుకుంటానని చెప్పి వెళ్లి, గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుమారుడి మృతిపై తండ్రి రామచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


