విద్యార్థుల ధర్నా
కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని శనిగరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని కోరుతూ పదోతరగతి విద్యార్థులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో తమకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల చదువులు సక్రమంగా సాగడం లేదని సిలబస్ పూర్తి కాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని లేదా ప్రత్యామ్నాయంగా డిప్యుటేషన్ ఉపాధ్యాయులను నియమించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో
అరుదైన ఆపరేషన్
దుబ్బాకటౌన్: దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన ఘనత సాధించారు. మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన 34 ఏళ్ల గర్భిణికి స్కానింగ్ లో 2.2 కిలోల ఫైబ్రాయిడ్ గడ్డ ఉన్నట్లు గుర్తించారు. ఈ క్లిష్టమైన కేసును సవాలుగా తీసుకున్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ బృందం గురువారం ఒకే ఆపరేషన్ లో సిజేరియన్ ప్రసవంతో పాటు ఫైబ్రాయిడ్ గడ్డను తొలగించారు. 3 కిలోల బరువుతో బిడ్డ జన్మించగా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రావంతి, మత్తు వైద్యుడు ప్రేమ్ కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు.
956 గ్రాముల
గంజాయి స్వాధీనం
తూప్రాన్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ పరిధిలోని కేఎల్‌ఆర్ గ్రీన్ వెంచర్‌లో గురువారం ఎకై ్సజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 956 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌కు చెందిన జ్యోతిష్ కుమార్ (22)ను అరెస్ట్ చేశారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రయ్యగౌడ్, సూపరింటెండెంట్ ఎల్. నరసింహారెడ్డి ఆదేశాల మేరకు డీటీఎఫ్ సీఐ గోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దాడులు నిర్వహించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచామని, గంజాయి సంబంధిత సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలని సీఐ గోపాల్ కోరారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది పుండరీకం, వహీద్, స్రవంతి, షాహిద్ పాల్గొన్నారు.
కంకర క్రషర్‌లో ప్రమాదం
తెగిన కార్మికుడి చెయ్యి
పటాన్‌చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లక్డారంలో ఉన్న ఓ కంకర క్రషర్‌లో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక క్రషర్‌లో పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేష్ (27) గురువారం తెల్లవారుజామున విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు యంత్రంలో చిక్కుకున్నాడు. ఈ క్రమంలో అతని కుడిచేయి నజ్జునజ్జు కావడంతోపాటు తెగిపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడిని తోటి సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం బీరంగూడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పటాన్‌చెరు పోలీసులను సంప్రదించగా, తమ సిబ్బందిని హైదరాబాద్ ఆస్పత్రికి పంపించామని, చికిత్స పొందుతున్న బాధితుడు ఇచ్చే స్టేట్ మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
విద్యార్థికి గాయాలు
పాపన్నపేట(మెదక్): మండల కేంద్రంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుల కథనం ప్రకారం.. నార్సింగి గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ పాపన్నపేట జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల విరామ సమయంలో మల్లంపేట రోడ్డు వైపు వెళ్లి తిరిగి వస్తుండగా ఎక్స్‌ఎల్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించి, మెరుగైన చికిత్స కోసం మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


