● వృద్ధురాలి మెడలోంచి పుస్తెలతాడు అపహరణ ● నిందితుడి అరెస్ట్, రిమాండ్
సిద్దిపేటకమాన్: ఆన్‌లైన్ క్యాసినో గేమ్స్‌కు బానిసైన వ్యక్తి సుమారు రూ.25లక్షలు నష్టపోయాడు. సులభంగా అప్పులు తీర్చేందుకు దొంగతనం చేయా లని నిర్ణయించుకున్నాడు. ఒంటరి మహిళే లక్ష్యంగా ఇంట్లోకి వచ్చి వృద్ధురాలి మెడలోంచి బంగారు పుస్తెలతాడు తస్కరించాడు. పోలీసులు సీసీ కెమరాల సాయంతో ఘటన జరిగిన 12గంటల్లోపే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన జిల్లా కేంద్రం సిద్దిపేటలో చోటు చేసుకుంది. సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వన్ టౌన్ సీఐ మహేందర్‌రెడ్డితో కలిసి ఏసీపీ రవిందర్‌రెడ్డి కేసు, నిందితుడి వివరాలను వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లికి చెందిన నాంపల్లి మహేశ్ (30) కొద్ది కాలంగా సిద్దిపేట పట్టణం శ్రీనగర్ కాలనీలో కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మహేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహేష్ కొంత కాలంగా ఆన్‌లైన్ క్యాసినో గేమ్స్‌కు బానిసై గత ఏడు నెలలుగా సుమారు రూ.25లక్షల వరకు నష్టపోయాడు. అప్పులు తీర్చేందుకు తన కుటుంబ సభ్యుల బంగారాన్ని సైతం వివిధ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టాడు. మరి కొంత మంది వద్ద అప్పులు కూడా చేశాడు. గతంలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో పట్టణంలోని పాత మార్కెట్ ప్రాంతానికి చెందిన రాజేశం కుటుంబంతో రెండు సార్లు డ్రైవర్‌గా వెళ్లాడు. అతడి భార్య పెంటమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నాడు. బుధవారం సాయంత్రం పెంటమ్మ ఇంటికి వెళ్లాడు. ఆమె భర్త ఇంట్లో లేడని నిర్ధారించుకుని మాస్క్ ధరించిన నిందితుడు వృద్ధురాలితో మాటలు కలిపి తాగడానికి నీళ్లు అడిగాడు. ఆమె నీళ్లు ఇచ్చే సమయంలో ఆమె మెడలో ఉన్న ఆరు తులాల బంగారు పుస్తెల తాడు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి బంగారు పుస్తెలతాడు, కారును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.


