● అకస్మాత్తుగా చెలరేగిన మంటలు ● సురక్షితంగా బయటపడిన కార్మికులు ● ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం
కంది (సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ’ప్యూర్ ఈవీ’ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో పరిశ్రమ ప్రాంగణంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంగారెడ్డి, పరిసర ప్రాంతాల నుంచి ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో దాదాపు కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కార్మికులంతా అప్రమత్తమై సురక్షితంగా బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, బ్యాటరీలతో నడిచే ఈవీ స్కూటర్లను తయారు చేసే ఈ ప్యూర్ ఈవీ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. ప్రాథమిక అంచనా ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కావొచ్చునని అధికారులు భావిస్తున్నారు.


