వాహనదారుల్లో భయాందోళన
పరిశీలించిన ఎస్పీ పరితోష్ పంకజ్
15 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు
సదాశివపేటరూరల్(సంగారెడ్డి): మండల పరిధి లోని సూరారం శివారులో గల ముంబై జాతీయ రహదారిపై ఉన్న గంగాకత్వ బ్రిడ్జి తీవ్రంగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. వంతెనపై రహ దారి పైభాగం కుంగిపోయి భారీ రంధ్రం పడటంతో నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో, వర్షం పడితే ఈ రంధ్రం కనిపించక పోవడంతో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు తక్షణ భద్రతా చర్యలు చేపట్టారు. రంధ్రం ఉన్న ప్రాంతం వద్ద సిగ్నల్స్, సూచిక బోర్డులను అమర్చి వాహనాలను వన్–వే అనుమతిస్తున్నారు. ఈ రహదారి పునరుద్ధరణ, మరమ్మతు పనులు పూర్తిగా ముగియడానికి దాదాపు 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
బ్రిడ్జిని పరిశీలించిన ఎస్పీ
సూరారం శివారులో దెబ్బతిన్న గంగాకత్వ బ్రిడ్జిని బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతాయని, వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని ఎస్పీ కోరారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ రెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తదితరులున్నారు.


