జహీరాబాద్ టౌన్: విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్‌మెన్(ఏఎల్‌ఎం) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని అనేగుంట పంచాయతీ పరిధిలో గల ఒంటెల గడ్డ తండాలో బుధవారం చోటు చేసుకుంది. జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. న్యాల్‌కల్ గ్రామానికి చెందిన హరీశ్(28)విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఒంటెల గడ్డ తండాలో కరెంట్ స్తంభాల సపోర్టు వైర్లకు విద్యుత్ సరఫరా అవుతోందని తండావాసులు ఫిర్యాదు చేయడంతో హరీశ్ మరమ్మతులు చేసేందుకు వెళ్లాడు. భవనంపై నుంచి పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు సపోర్టు వైర్‌ను పట్టుకోవడంతో ఒక్కసారిగా విద్యుత్‌షాక్ తగిలింది. దీంతో ఆయన ఇంటిపై నుంచి కిందపడి తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో డీఈ.శ్రీనివాస్, ఏడీ నాగరాజ్, ఏఈ ముఖీం, ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కుటుంబాన్ని ఆదుకుంటాం
ఆసుపత్రి వద్ద మృతుని కుటుంబ సభ్యులను డివిజన్ డీఈ. శ్రీనివాస్, ఏడీ నాగరాజ్ పరామర్శించి, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శాఖ పరంగా మృతుని భార్యకు ఉద్యోగంతో పాటు హరీశ్‌కి రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను త్వరలో అందజేస్తామని చెప్పారు.


