కొండాపూర్(సంగారెడ్డి): అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండాపూర్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కోహీర్ మండలం పీచే ర్యాగడి గ్రామానికి చెందిన మంగలి వీరేశం(33) వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తుమ్మలపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆరేళ్లుగా కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తాలో నివాసం ఉంటున్నారు. కాగా క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి మంగలి రామచందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.


