జాగృతి యాత్రకు విద్యార్థిని ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాగృతి యాత్రకు విద్యార్థిని ఎంపిక

Nov 5 2026 8:44 AM | Updated on Nov 5 2026 8:44 AM

జాగృతి యాత్రకు విద్యార్థిని ఎంపిక అంబులెన్స్‌లో ప్రసవం వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. విద్యార్థిని మృతి చెందిన ఘటనలో సిబ్బందిపై చర్యలు కార్యాలయంలో సీపీయూ మాయం ఎలుగుబంటి సంచారం

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): పాలమూరు యూనివర్సిటీ నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాగృతి యాత్రకు మండలంలోని మెలిగిరిపేట్‌కు చెందిన హర్షితారెడ్డి ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి, మంజుల దంపతుల రెండవ కుమార్తె హర్షితారెడ్డి పీయూలో ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న యువతలో పారిశ్రామిక ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాంకేతిక విద్యామండలి నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా 15 రోజుల పాటు పలు ప్రాంతాలను యాత్రలో భాగంగా సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు, విద్యావంతులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ గ్రామానికి గర్వకారణం అని పేర్కొన్నారు.

వట్‌పల్లి(అందోల్‌): అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన అనూష బుధవారం ఉదయం పురిటి నొప్పులతో బాధపడుతుండంతో కుటుంబీకులు 108కు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న అంబులెన్స్‌ మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు తీవ్రమై మార్గమధ్యలోనే ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని పైలెట్‌ సంతోష్‌ తెలిపారు. అనంతరం తల్లిబిడ్డలను సంగారెడ్డి జిల్లా మాతాశిశు ఆస్పత్రిలో చేర్పించారు.

కాపాడిన పోలీసులు

మద్దూరు(హుస్నాబాద్‌): ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలను పోలీసులు కాపాడారు. ఈ ఘటన దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కాగా పెట్రోలింగ్‌లో భాగంగా గ్రామంలో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ దిలీప్‌, రాజ్‌కుమార్‌లకు విషయం తెలియగానే అప్రమత్తమై పొలం వద్దకు వెళ్లి అతడికి ప్రాథమిక చికిత్సలో భాగంగా ఉప్పునీరు తాగించారు. అనంతరం అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్స్‌ను సిద్దిపేట సీపీతో పాటు, గ్రామస్తులు అభినందించారు.

సిద్దిపేటరూరల్‌: ఇటీవల మండల పరిధిలోని రాఘవాపూర్‌ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన ఘటనపై బుధవారం జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థిని దేవులగల్ల లాస్యకు ఎదురైన అనారోగ్య సమస్యకు సంబంధించి పాఠశాల సిబ్బంది సకాలంలో వైద్య సహాయం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న ప్రత్యేక అధికారి, ఏఎన్‌ఎం, ఇద్దరు ఉపాధ్యాయుల సేవలు రద్దు చేస్తున్నట్లు డీఈఓ రమేశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్‌ కార్యాలయంలో సీపీయూ మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం నుంచి సీపీయూ కనిపించడం లేదని తెలిసింది. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ అభిలాష్‌ను వివరణ కోరగా.. సీపీయూ కనిపించడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. సదరు సీపీయూ ట్రేడ్‌ లైసెన్సులను ఆన్‌లైన్‌ చేసేందుకు మాత్రమే వినియోగిస్తారని, అందులో ఎలాంటి డేటా ఉండదని చెప్పారు. అయినా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

భయాందోళనలో ప్రజలు

బెజ్జంకి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా శివారు గ్రామమైన తలారువాని పల్లె, కరీంనగర్‌ జిల్లాలోని చీమలకుంటపల్లె గ్రామాల సమీపంలోని వరద కాలువ వద్ద ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ గ్రామాల సమీపంలో గల కాలువ ద్వారా పరిసర గ్రామాలైన వడ్లూరు, బేగంపేట గ్రామాలకు వస్తుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎలుగుంటి సంచరిస్తున్న వీడియో గ్రామాల్లోని సోషల్‌ మీడియా గ్రూపులలో వైరల్‌ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement