ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు

Nov 5 2026 8:44 AM | Updated on Nov 5 2026 8:44 AM

ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు టిప్పర్‌, మూడు ట్రాక్టర్లపై కేసు లారీ డ్రైవర్‌పై దాడి : ఇద్దరిపై కేసు యువతి అదృశ్యం

పటాన్‌చెరు: ప్రైవేట్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఇస్నాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, సీఐ మహేశ్‌ కథనం ప్రకారం.. ముత్తంగికి చెందిన బాధిత మహిళ ఇద్దరు కుమారులు ఇస్నాపూర్‌లోని జ్ఞాన్‌ ఓక్‌ పాఠశాలలో చదువుతున్నారు. ఆమె కుమారుడు పాఠశాలలోని బాలికల బాత్‌రూమ్‌లో ఏదో రాశాడని సరైన ఆధారాలు చూపకుండా, ప్రిన్సిపాల్‌ నిసారుద్దీన్‌ విద్యార్థి తల్లికి రాత్రి కాల్స్‌ చేసి, వాట్సాప్‌ సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో ప్రిన్సిపాల్‌ వ్యవహార శైలిపై బాధితురాలు బుధవారం ఇస్నాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

చేర్యాల(సిద్దిపేట): అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్‌, మూడు ట్రాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ అపూర్వరెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధిలోని చుంచనకోటలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారన్న సమాచారం వచ్చింది. ఈ మేరకు సిబ్బంది అక్కడికి వెళ్లి చూడగా మట్టి లోడుతో ఉన్న టిప్పర్‌తో పాటు 3 ట్రాక్టర్లు ఉన్నాయి. పోలీసులు వాటిని వెంటనే స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఎవరైనా గ్రామాల్లో అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలుంటాయని తెలిపారు.

మునిపల్లి(అందోల్‌): లారీ డ్రైవర్‌పై దాడి చేసిన ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ ఘటన బుధవారం మండలంలోని కంకోల్‌ సమీపంలో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బుదేరా ఎస్‌ఐ అరవింద్‌ ఎస్‌ఐ కథనం ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న క్రమంలో కంకోల్‌ గ్రామ శివారులోకి రాగానే అజయ్‌ జగదీష్‌, బల్బీమ్‌ దినకర్‌ నడిపిస్తున్న లారీని వెనక నుంచి వచ్చిన పరమేశ్వర్‌ ఓవర్‌ టేక్‌ చేశాడు. నా లారీనే ఓవర్‌ టేక్‌ చేస్తావా అని పరమేశ్వర్‌పై ఇనుప రాడ్‌తో ఇద్దరు కలిసి దాడి చేశారు. దీంతో పరమేశ్వర్‌ తలకు, కుడి చేతికి గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో దాడికి పాల్పడిన అజయ్‌ జగదీష్‌, బల్బీమ్‌ దినకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

చేగుంట(తూప్రాన్‌): ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలోని మక్కరాజీపేటలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వరలక్ష్మి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వాలంటరీ టీచర్‌గా పని చేస్తుంది. మంగళవారం సాయంత్రం బట్టలు కుట్టించుకునేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. రాత్రివరకు ఇంటికి రాకపోవడంతో ఫోన్‌ చేస్తే స్విచ్‌ఆఫ్‌ వచ్చింది. బంధువులు, తెలిసిన వారివద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తల్లి సుగుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement