ఐదు దశాబ్దాల క్రితం నిర్మాణం
రెండెకరాల్లో అపార్టుమెంట్లు నిర్మిస్తే
ఉపయోగకరం
జహీరాబాద్: గతంలో ప్రభుత్వ నివాస గృహాల కోసం అధికారులు పోటీపడే వారు. ఇందుకోసం పైరవీలు సైతం చేసేవారు. జహీరాబాద్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్మించిన నివాస గృహాల సముదాయం ఆర్టీసీ బస్టాండ్‌కు అతి దగ్గరగా ఉండటం, మార్కెట్‌కు వెళ్లేందుకు వీలుగా సౌకర్యవంతంగా ఉండటంతో నివాస గృహాల్లో ఉండేందుకు అధికారులు ఇష్టపడే వారు. అప్పట్లో అద్దె భవనాలు అంతంతమాత్రమే అందుబాటులో ఉండటం, ఉన్న భవనాలు ఇరుకుగా ఉండటం వల్ల ఆయా శాఖల అధికారులు అధికార నివాస గృహాల్లో నివాసం ఉండేందుకు మక్కువ చూపేవారు. నామమాత్రపు అద్దెలు ఉండటమే కాకుండా నివాసముండేందుకు అనువైన ప్రాంతం కావడమే ఇందుకు కారణం. గాలి, వెలుతురు బాగా వచ్చే విధంగా నిర్మాణాలు జరిగాయి. గృహాలకు ఇరువైపులా విశాలమైన ఖాళీ స్థలం ఏర్పాటు చేశారు. ఒక క్వార్టర్‌లో ఒక కుటుంబమే నివాసం ఉండేలా నిర్మాణం చేశారు. అయితే ఇప్పుడవి నిర్వహణ లోపం కారణంగా శిథిలావస్థలకు చేరుకున్నాయి. రెండు క్వార్టర్లలో మినహా మిగతా క్వార్టర్లనీ గత దశాబ్దకాలంగా ఖాళీగానే ఉంటున్నాయి. అయినా వీటి విషయంలో అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
ఉత్తమ సేవలందించేందుకే నిర్మాణం
విధులు నిర్వహించే చోట అధికారులు నివాసం ఉంటే ప్రజలకు ఉత్తమ సేవలు అందుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం అధికారులకు నివాస గృహాలను నిర్మించింది. రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో 1973 సంవత్సరంలో 17 నివాస గృహాలను నిర్మించారు. వీటిని అద్దె ప్రాతిపదికన కేటాయించారు. నిర్మాణం విషయంలో ప్రత్యేక చొరవ చూపిన ప్రభుత్వం వాటి నిర్వహణ విషయాన్ని గాలికి వదిలేసింది. దీంతో వర్షాకాలంలో కురియడం, వాటికి మరమ్మతులు చేయకపోవడంతో వినియోగించుకునేందుకు వీలు లేకుండా పోయింది. కిటీలు, తలుపులు ఊడటం గోడలు కూలిపోయాయి. దీంతో నివాసమున్న అధికారులు వాటిని వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం పిచ్చమొక్కలు, శిథిలాలతో దర్శనమిస్తున్నాయి. నివాస గృహాలు శిథిలం కావడం, పిచ్చమొక్కలు పెరగడంతో విషపూరిత క్రిమి, కీటకాలకు నిలయంగా మారిందని పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం
శిథిలమైన నివాస గృహాల విషయమై ఇప్పటివరకు ఎలాంటి ఆలోచన చేయలేదు. వీటి పరిస్థితుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రస్తుతం గృహాలు నివాసముండేందుకు ఏ మాత్రం అనువుగా లేవు. దీంతో అవి ఖాళీగానే ఉంటున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి కార్యచరణ చేపడతాం.
–రామకృష్ణ, ఆర్‌అండ్‌బీ ఇన్‌చార్జి డీఈఈ
అపార్టుమెంట్లు నిర్మిస్తే ఉపయోగకరం
శిథిలమైన నివాస గృహాలను పూర్తిగా కూల్చివేసి, వాటి స్థానంలో కొత్తగా భవనాలు నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అపార్టుమెంట్ల మాదిరిగా పలు అంతస్థుల భవనాలను నిర్మించడం ద్వారా సుమారు 200లకు పైగా కుటుంబాలు నివాసం ఉండేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. బహుళ అంతస్థుల భవనాలను నిర్మించడం ద్వారా ఉద్యోగులు నివాసం ఉండేందుకు సౌకర్యంగా మారుతుంది. ప్రభుత్వానికి ఆదాయం సైతం సమకూరుతుంది. లేనట్లయితే సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవనాలను నిర్మించినా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
నాడు అద్దె కోసం పోటీ
నేడు కన్నెత్తి చూడని దుస్థితి


