నారాయణఖేడ్: నీటిని పొదుపుగా వాడుకుంటూ ఎల్నినో సమస్యను అధిగమించాలని ఎమ్మెల్యే డా.సంజీవరెడ్డి కోరారు. ఖేడ్ మండల పరిషత్లో మంగళవారం అధికారులు, సర్పంచ్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఈ ఏడాది గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎల్నినో సమస్యతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్నారు. అందువల్ల ప్రతీ నీటి చుక్కను వృథా కాకుండా చూడాలన్నారు. ప్రతీ ఇంటి వద్ద ఇంకుడు గుంతను నిర్మించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొనకుండా ఉండటానికి బోరు బావుల్లో సింగిల్ ఫేజ్ మోటార్లను వినియోగించి నీటి సమస్య రాకుండా చూడాలని సర్పంచులకు సూచించారు. వీబీజీ రాంజీ పథకం కింద ఫామ్పాండ్స్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ బోరుబావుల వద్ద నీరు వృథా పోకుండా ఫ్లో ట్యాంకులను నిర్మించి పశువులకు కూడా నీటి సమస్య తలెత్తకుండా పశువులు నీటి తొట్లను నిర్మించాలన్నారు. సమీక్షలో ఆత్మ చైర్మన్ వినోద్ పాటిల్ పాల్గొన్నారు.


