ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): కాంగ్రెస్ ప్రభుత్వ విఫల పాలనపై త్వరలోనే పాదయాత్ర చేపడతామని ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు. మండలంలోని వెల్టూర్ గ్రామ శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌లో మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వ హించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. అంతకుముందు పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, అక్రమ అరెస్టులు, వేధింపులు, అవమానాల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యకర్తల సమస్యలను సావధానంగా విన్న చింతా ప్రభాకర్ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం అయన మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకులే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అంతర్గత కుమ్ములాటలతో కాలం గడుపుతున్నారని, అలాంటి నాయకులు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించలేని అసమర్థ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిపోయిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.


