● సీఐటీయూ డిమాండ్ ● డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె
కొండాపూర్(సంగారెడ్డి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును మెడికల్ ఆఫీసర్ అర్చనకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు రాజయ్య, బాబురావు మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా ప్రజలకు, గర్భిణులకు సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు కాంగ్రె స్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం శిక్షణ పొందిన ఆశా వర్కర్లకు పదోన్నతి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ.5 లక్షలు చెల్లించాలని, పారితోషికంలో సగం పింఛన్‌గా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం డిసెంబర్ 15లోగా సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి తుల్జ మ్మ, యూనియన్ నాయకులు విజేత, వినోద, ప్రమీల, పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


