● మేనమామ ఇంట్లో చోరీ చేసిన అల్లుడు అరెస్ట్ ● ఆభరణాలు, నగదు స్వాధీనం ● కేసు వివరాలు వెల్లడించిన సీఐ
వట్‌పల్లి(అందోల్): ఆ గ్రామంలో ఉన్న ఒకటే సీసీ కెమెరా.. చోరీ చేసిన దొంగను పట్టించింది. సోమవారం జోగిపేట సీఐ అనీల్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. అందోలు మండల పరిధిలోని మన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన పిట్ల శ్రీశైలం గత నెల 30న తన కుటుంబంతో కలిసి అల్లాదుర్గ్ మండలం ముస్లాపూర్‌లో తన అక్క కూతురు ఎంగేజ్‌మెంట్‌కు వెళ్లి అదే రోజు రాత్రి ఇంటికి వచ్చాడు. కాగా ఇంటి తాళాలు పగులగొట్టి, బీరువాలో ఉన్న 5తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.8 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా చోరీకి పాల్పడిన వ్యక్తి బాధితుడు శ్రీశైలం మరో అక్క కుమారుడైన కొల్చారం మండలం రంగంపేటకు చెందిన సార చంద్రశేఖర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ముస్లాపూర్‌లో జరిగిన ఫంక్షన్‌కు చంద్రశేఖర్ కూడా వెళ్లగా అక్కడ మేనమామ శ్రీశైలం, కుటుంబ సభ్యులు అక్కడే ఉండడంతో ఈ చోరీకి ప్లాన్ చేశాడు. బైక్‌పై మన్‌సాన్‌పల్లికి వచ్చి మేనమామ ఇంటి తాళాలు పగులగొట్టి నగలను ఎత్తుకెళ్లినట్లు విచారణలో నేరం అంగీకరించాడు. ఇప్పటికే నిందితునిపై పాపన్నపేట పోలీస్టేషన్‌లో పోక్సో కేసు నమోదవ్వగా, అతని ఫోన్‌ను సీజ్ చేశారు. దీంతో ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్ కొనుక్కోవడానికి తండ్రిని రూ.50 వేలు అడిగితే నిరాకరించాడు. డబ్బుల కోసమే ఈ చోరీకి పాల్పడినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్‌లు సంగమేశ్, వీరేశం పాల్గొన్నారు.


